మొంథా తుపాను ప్రభావంతో వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రోజంతా కుండపోతగా వర్షం కురియడంతో వరంగల్ నగరం జలదిగ్బంధం అయింది. వర్షం కాస్తా తెరపినిచ్చినప్పటికీ నగరాన్ని ఇంకా వరద వీడలేదు. వర్షపు నీరు పలు కాలనీలను ముంచెత్తింది. మొత్తం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తింది. నగరం పరిధిలోని 30 కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి.
సూర్యాపేట జిల్లాలో చెట్టు కూలడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఖమ్మం జిల్లాలో డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో జోరువాన కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. వరద నీటితో ఉప్పల్, నాగోల్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నాయి.
అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, మధురానగర్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడలో తదితర ప్రాంతాల్లో వర్షపు చినుకులకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగడ్డ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మూసాపేటలో రోడ్లు కాలువల్లా మారాయి. రాయదుర్గం కారిడార్‌లో పదుల కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. కార్యాలయాల నుంచి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తుపాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం ఏకధాటిగా పడుతోంది. దీంతో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకు వరద ప్రవాహం పెరిగింది. ఉస్మాన్‌సాగర్ 10 గేట్లు ఎత్తి మూసీలోకి 2,630 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. జంట జలాశయాల్లోకి వరద పెరగడంతో చాదర్‌ఘాట్, మూసి పరీవాహక ప్రాంత ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.
More Stories
జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్
జూబ్లీహిల్స్ లో బిజెపి అనుకూల వాతావరణం
హిందూ మహిళపై అత్యాచారం… అబ్దుల్ లతీఫ్ కు పదేళ్లు జైలు