అమెరికా ఆంక్షలతో రష్యా చమురుకు చెల్లింపు సమస్యలు!

అమెరికా ఆంక్షలతో రష్యా చమురుకు చెల్లింపు సమస్యలు!
* అర్ధాంతరంగా వెనుకకు మళ్ళిన రష్యా ఆయిల్ ట్యాంకర్
రష్యాకు చెందిన ఇంధన కంపెనీలపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేసిన నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి కొత్తగా చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చెల్లింపులకు సంబంధించి ఆందోళనలు తలెత్తినందువల్ల ప్రభుత్వం, చమురు సరఫరాదారుల నుంచి స్పష్టమైన వివరణకోసం భారత చమురుశుద్ధి కర్మాగారాలు ఎదురుచూస్తున్నాయి.
 
ఈ అనిశ్చిత పరిస్థితి తొలగేవరకూ రిఫైనరీలు తాత్కాలికంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని ఇం డియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చమురు కొసం కొత్త టెండర్లు జారీ చేసింది. ప్రైవేటు రంగంలో అతిపెద్దదైన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాట్ కొనుగోళ్ల కోసం ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 
 
గతవారం రష్యాలోని రెండు అతిపెద్ద చమురు ఉత్పత్తిసంస్థలైన లుకోయిల్, రోస్నెఫ్ట్ లపై అ మెరికా కొత్త ఆంక్షలు విధించింది.ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యురోపియన్ యూనియన్, బ్రిటన్ ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను పొడగించాయి. దానితో చాలా కార్గోలు రద్దయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ లు బ్లాక్ లిస్ట్ చేయడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. 
 
అందువల్ల చెల్లింపులు ఆగిపోయే రిస్క్ ఏ కంపెనీలు చేయబోవని చమురు వ్యవహారాలను చూసే అధికారి ఒకరు వివరించారు. ప్రభుత్వం నుంచి, సరఫరాదారులనుంచి స్పష్టమైన వివరణవస్తే తప్ప తాము కొత్త ఆర్డర్లు ఇవ్వలేమని ఓ చమురు శుద్ధి కర్మాగారం నిర్వాహకుడు చెప్పారు. 2022 నుంచి రష్యా నుంచి పెద్దగా చమురు కొనుగోలు చేస్తున్న రిలయన్స్ తాము అన్ని ఆంక్షలను పాటిస్తూనే, ఇప్పటికే ఉన్న ఇతర సరఫరాదారులతో సంప్రదిస్తున్నామని పేర్కొంది. 
 
రిలయన్స్ కూడా రష్యన్ కంపెనీ రోస్నెఫ్ట్ నుంచి చమురు దిగుమతి నిలిపివేసినట్లు సమాచారం. 2025 మొదటి 9 నెలల్లో భారతదేశం రోజుకు 2.9 మిలియన్ బ్యారెళ్ళ చొన రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇది రష్యా మొత్తం ఎగుమతుల్లో 40 శాతం. ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య మనదేశం రష్యా నుంచి చేసుకుంటున్న చమురు దిగుమతులు 8.4 శాతం తగ్గాయి. శుద్ధి కర్మాగారాలు పశ్చిమాసియా, అమెరికా నుంచి కొనుగోళ్లను పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయి.
ఇలా ఉండగా, రష్యా ముడి చమురుతో భారత్‌కు పయనమైన ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ బాల్టిక్‌ సముద్రంలో అర్ధాంతరంగా వెనుకకు మరలింది. దీంతో భారత్‌, రష్యా మధ్య చమురు వాణిజ్యం నిలిచిపోయినట్లు వెలువడుతున్న వార్తలకు బలం చేకూర్చినట్లు అయింది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 
 
అయితే రాయితీ ధరలకు లభిస్తున్న రష్యా చమురుపై భారీగా ఆధారపడిన భారతీయ రిఫైనరీలు తాజా పరిణామంతో అనిశ్చితికి లోనయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రష్యాలోని ప్రిమోరస్క్‌ పోర్టు నుంచి దాదాపు 7.30 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతోబయల్దేరిన ఫూరియా అనే ట్యాంకర్‌ గుజరాత్‌లోని సిక్కా పోర్టుకు చేరుకోవలసి ఉంది. డెన్మార్క్‌, జర్మనీ మధ్య ఫెహమార్న్‌ బెల్ట్‌ చేరుకున్న అనంతరం హఠాత్తుగా వెనక్కు మరలిన ఆ ట్యాంకర్‌ ఈజిప్టులోని ఓ పోర్టు వైపు దిశ మార్చుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.