మయన్మార్ లో గ్లోబల్ ఆన్ లైన్ మోసం కార్యకలాపాలు చేస్తున్న సైబర్ కేంద్రాలపై ఆ దేశం సైన్యం కఠినచర్యలు చేపట్టడంతో దాదాపు 500 మంది భారతీయులు థాయిలాండ్ కు పారిపోయారు. థాయిలాండ్ లోకి ప్రవేశించిన వారిని, చట్టపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్వదేశానికి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు థాయిలాండ్ అధికారులతో భారత అధికారులు సంప్రదింపులు ప్రక్రియ చేపట్టారు.
మయన్మార్ లోని కెకె పార్క్ కాంప్లెక్స్ లోని సైబర్ స్కామ్ కేంద్రాలలో వెట్టి చాకిరీ చేస్తున్న బాధితులు వీరు. ఆ కేంద్రాలపై సైన్యం కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలియడంతో సరిహద్దులు దాటి థాయిలాండ్ కు చేరినవారిని, స్వదేశానికి రప్పించేందుకు భారతదేశం థాయిలాండ్ కు ఒక విమానం పంపే ఆలోచనలో ఉంది.
థాయిలాండ్ పశ్చిమ ప్రాంతంలోని మే సోట్ లో దాదాపు 500 మంది భారతీయులు ఉన్నట్లు థాయ్ ప్రధాని అనుతిన్ చార్న్ విరాకుల్ తెలిపారు. వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు భారతదేశం డైరెక్ట్ విమానాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. బ్యాంకాక్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు ఈ విషయంలో థాయి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ధాయిలాండ్ అధికారులు అదుపులోకి తీసుకున్న భారతీయులకు సంబంధించిన సమాచారం తమ వద్దఉందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మయన్మార్ సైబర్ స్కామ్ కేంద్రాలపై సైన్యం కఠిన చర్యలు చేపట్టిన తర్వాత మయన్మార్ నుంచి పారిపోయిన 28 దేశాల పౌరులలో 1500 మందికి పైగా భారతీయులు ఉన్నారు.

More Stories
ఎన్నికల్లో పోటీచేస్తా.. లేకపోతే లక్షలాదిమంది బహిష్కరిస్తారు!
త్వరలో భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం .. ట్రంప్
ప్రపంచ శాంతికి భారత్- జపాన్ సంబంధాలు కీలకం