శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్ట్ నిధులతో ఐదు వేల ఆలయాలను నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంతో గిరిజన తండాలు గోవింద నామస్మరణలతో మార్మోగనున్నాయి. టీటీడీ పర్యవేక్షణలో దేవాదాయశాఖ ద్వారా రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలో ఐదు వేల గోవిందుడి ఆలయాలు నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులు అరికట్టడం, హిందూ ధర్మ పరిరక్షణ, వ్యాప్తి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఆలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. టిటిడి పర్యవేక్షణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనులు చేసేందుకు నిధుల కొరత లేకుండా శ్రీవాణి ట్రస్ట్ నుంచి రూ.175 కోట్లు దేవాదాయ శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించారు.
వైఎస్సార్సీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు దారిమళ్లాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పర్యవేక్షణకు వీలుగా దేవాదాయశాఖ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణం ప్రారంభించాక వివిధ దశల్లో చిత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేలా నిబంధనలు రూపొందించారు.
గిరిజన ప్రాంతాల్లో గ్రామాల జనాభా, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మూడు రకాల ఆలయాలను నిర్మించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇందుకు రూ. 10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాల్లో ఒక్కో ఆలయానికి రూ.5 లక్షలు మాత్రమే కేటాయించారు. కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచింది.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం జరుగనున్న పుష్పయాగానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.
రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారిని ఆలయం నుంచి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

More Stories
కల్తీ నెయ్యిలో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్
వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుపాను
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జోక్యం చేసుకోలేం