యావత్ బీహార్‌ను ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ఇక్కడ పురుడు పోసుకున్న పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలను మహాగఠ్ బంధన్ బిహార్‌లో అధికారంలోకి వస్తే జైళ్లలోనే ఉంచుతారా? అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. బీహార్ లోని బెగుసరాయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటూ పట్నాలోని ఫుల్వారీ షరీఫ్‌లో పీఎఫ్ఐ కార్యకర్తలు చురుకుగా ఉన్నారని ఆరోపించారు.
కానీ ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో సోదాలు చేయించి పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేయించారని, అందరినీ జైల్లో పెట్టించారని అమిత్ షా తెలిపారు. మీరంతా ఆ పీఎఫ్ఐ సభ్యులను వదిలిపెట్టాలని కోరుకుంటున్నారా? అని ఓటర్లను ప్రశ్నించారు. పీఎఫ్ఐ అనేది జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థ అని, అందుకే ప్రధాని మోదీ ఆ సంస్థపై నిషేధం విధించారని తెలిపారు.
కానీ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పీఎఫ్ఐ సభ్యులను పగటి కలల్లో విహరింప జేస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే మిమ్మల్ని జైళ్ల నుంచి విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారని అమిత్ షా ఆరోపించారు. కానీ ప్రధాని మోదీ మాత్రం భారత భూభాగంపైన ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని తుడిచిపెట్టే పనిలో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా దేశంలో నక్సలిజం అంతం కాబోతోందని స్పష్టం చేశారు.
బీజేపీ చాలా మంది యువకులకు టికెట్లు ఇచ్చిందని చెబుతూ కానీ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు యువతకు టికెట్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎందుకంటే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజస్వీ యాదవ్‌ను బిహార్ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిగా చేయాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
లాలూ ప్రసాద్ దాణా, ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో ఉన్నారని, కాంగ్రెస్ రూ. 12 లక్షల కోట్ల అవినీతి కేసుల్లో చిక్కుకుందని పేర్కొంటూ అది మహాగఠ్ బంధన్ కాదు ‘దొంగ బంధన్ అని అమిత్ షా విమర్శించారు. ఇక ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీయాదవ్ పేరును ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ ఏ సీట్ ఖాళీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ కొనసాగుతారని స్పష్టం చేశారు
ఎన్డీఏ ప్రభుత్వం బిహార్‌లోని 8.52 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తుందని, మఖానా బోర్డును ఏర్పాటు చేసిందని అమిత్ షా తెలిపారు. గృహ వినియోగదారులకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని గుర్తు చేశారు. దర్భాంగాకు త్వరలో మెట్రో రైలు వస్తుందని, ఇప్పటికే విమానాశ్రయం నిర్మితమైందని పేర్కొన్నారు. ఎయిమ్స్ నిర్మాణ దశలో ఉందని వెల్లడించారు. మిథిలాలో సీతాదేవి ఆలయం నిర్మిస్తున్నామని, ఆమె సందర్శించిన అన్ని ప్రదేశాలు రామ్ సర్క్యూట్‌కు అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ సర్కార్ ప్రభుత్వం మైథిలికి అధికారిక హోదా ఇచ్చిందని పేర్కొన్నారు.
“550 ఏళ్లు రామ్ లల్లా ఒక గుడారంలో ఉన్నాడు. మేము అయోధ్యలో ఒక గొప్ప రామాలయాన్ని నిర్మించాం. ఆర్జేడీ, కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీ, ఎస్పీ రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించాయి. కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ కంపెనీ 70 ఏళ్లుగా ఆర్టికల్ 370ని రక్షించాయి. దాన్ని 2019 ఆగస్టు 5న శాశ్వతంగా రద్దు చేశాం” అని అమిత్ షా గుర్తు చేశారు.
“శత్రుదేశం పాక్‌పై ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేశాం. మరొకరి వైమానిక దాడులు జరిపాం. మూడోది ఆపరేషన్ సిందూర్. ఈ చర్యల ద్వారా శత్రుదేశానికి తగ్గిన బుద్ధి చెప్పాం.” అని అమిత్ షా తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్, రాహుల్‌గాంధీ అక్రమార్కులకు రక్షకులుగా ఉంటున్నారని పేర్కొంటూ ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరినవాళ్లను తొలగించవద్దని వారు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అక్రమంగా చొరబడి ఓటర్ల జాబితాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారిని తొలగించాలా.. వద్దా? అని ఓటర్లను ఉద్దేశించి షా ప్రశ్నించారు.

More Stories
జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్
శాంతి దూతలుగా మారిన ముస్లిం దేశాలు, చైనా!
ఎన్నికల్లో పోటీచేస్తా.. లేకపోతే లక్షలాదిమంది బహిష్కరిస్తారు!