భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ తండ్రిలాంటి వారని, చాలా మంచి వ్యక్తి అనీ అదే సమయంలో ఆయన చాలా కఠినమైనవారని ట్రంప్ తెలిపారు. భారత్‌తో అతి త్వరలోనే వాణిజ్య ఒప్పందం జరగనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దక్షిణ కొరియాలో జరగుతున్న ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ (అపెక్) సదస్సులో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
“నాకు ప్రధాని మోదీ పట్ల ప్రేమ, గౌరవం ఉంది. ఆయనతో నాకు అద్భుతమైన సంబంధం ఉంది. మోదీ చాలా మంచిగా కనిపిస్తారు. ఒక తండ్రిలా ఉంటారు. కానీ ఆయన చాలా కఠినమైనవారు” అంటూ చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం “చాలా యుద్ధాలను ఆపివేసింది” అని ట్రంప్ నొక్కి చెప్పిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, “ప్రపంచవ్యాప్తంగా” అమెరికా “ఒక వాణిజ్య ఒప్పందం తర్వాత మరొక ఒప్పందంపై సంతకం చేస్తోందని” ఆయన ప్రస్తావించారు.
“మేం యుద్ధం చేసి తీరుతాం అని అన్నారు. నాకు తెలిసిన వ్యక్తి ఆయనేనా అని అనిపించింది. అలా జరిగితే భారత్‌పై టారిఫ్‌లు భారీగా పెంచుతానని హెచ్చరించా. అటు పాక్‌ను కూడా బెదిరించా. రెండు రోజుల తర్వాత భారత్-పాక్ ప్రధానులు నాకు ఫోన్ చేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్నామని, యుద్ధాన్ని ముగిస్తామని చెప్పారు. ఇది అద్భుతంగా అనిపించింది” ట్రంప్ పేర్కొన్నారు.
ఇప్పటికే ఆలస్యమైన వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్ -అమెరికా సంతకం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. పాడి, వ్యవసాయ రంగాల్లో మార్కెట్ తెరిచేందుకు భారత్ నిరాకరించడంతో పాటు ట్రంప్ భారీ సుంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి అంశాల వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఆలస్యమవుతూ వచ్చాయి. అయితే కొన్ని వారాల క్రితం ఇవి వేగం పుంజుకున్నాయి.
నవంబర్ నెలాఖరు కల్లా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో భారత్- అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న వాణిజ్య చర్చలు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాసం ఉంది. ఈ ట్రేడ్ డీల్‌తో భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు భారీగా తగ్గనున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ వస్తువులపై 50శాతం టారిఫ్ ఉంది. వాణిజ్య ఒప్పంద కుదిరితే 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉందని ఇటీవల పలు కథనాలు వెల్లడించాయి.

More Stories
ప్రపంచ శాంతికి భారత్- జపాన్ సంబంధాలు కీలకం
చైనాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అర్హతలు
టర్కీలో పాక్- ఆఫ్ఘన్ శాంతి చర్చలు విఫలం