ప్రశాంత్‌ కిషోర్‌కు రెండు రాష్ట్రాల్లో ఓటు

ప్రశాంత్‌ కిషోర్‌కు రెండు రాష్ట్రాల్లో ఓటు
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు చిక్కుల్లో పడ్డారు. జన్‌ సురాజ్‌ పార్టీని స్థాపించి ఏ పొత్తూ లేకుండా ఒంటిరిగా బరిలో నిలిచిన కిషోర్‌కు రెండు రాష్ట్రాల్లో ఓటు ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. బీహార్‌లోని కర్గహార్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో, పశ్చిమబెంగాల్‌లోని భవానీనగర్‌ అసెంబ్లీ స్థానంలో ఆయన ఓటరుగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కర్గహార్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ కిషోర్‌కు లేఖ రాశారు. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో మీరు ఓటరుగా ఎందుకు పేరు నమోదు చేసుకున్నారో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ లేఖలో ఆదేశించారు. ఆయన నేరుగాగానీ, ఆయన తరఫున ఎవరైనాగానీ హాజరై వివరణ ఇవ్వవచ్చని పేర్కొన్నారు.

‘2025 అక్టోబర్‌ 28న ప్రచురితమైన వార్త ప్రకారం మీ పేరు బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రెండు రాష్ట్రాల్లో ఓటరుగా ఉన్నది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ తరఫున మూడు రోజుల్లో మా ముందు హాజరు కావాలి. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఎందుకు ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారో వివరణ ఇవ్వాలి’ అని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తన లేఖలో ఆదేశించారు.

ప్రశాంత్‌ కిషోర్‌ కోల్‌కతాలోని భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నారు. అది పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి సొంత నియోజకవర్గం. నియోజవర్గంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆయన అడ్రస్‌గా పేర్కొన్నారు. బీ రాణీశంకరీ రోడ్‌లోని సెయింట్‌ హెలెన్‌ పోలింగ్‌ స్టేషన్‌లో ఆయనకు ఓటు ఉందని అధికారులు తెలిపారు.

2021లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేశారు. అప్పుడే ఆయన ఓటరుగా నమోదయ్యారు. ఇక బీహార్లోని ససారామ్‌ నియోజకవర్గంలో కూడా ప్రశాంత్‌ కిషోర్‌ ఓటరుగా ఉన్నారు. కోనార్‌లోని మధ్య విద్యాలయ పోలింగ్‌ కేంద్రంలో ఆయనకు ఓటు ఉందని అధికారులు వెల్లడించారు.

రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ యాక్ట్‌ 1950లోని సెక్షన్‌ 17 ప్రకార ఏ వ్యక్తికి కూడా దేశంలోని ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో  ఓటు హక్కు ఉండకూడదని ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే ప్రశాంత్‌ కిషోర్‌కు రెండు రాష్ట్రాల్లో ఓటు ఉండటం ఆయనను చిక్కుల్లో పడేసింది. సొంత పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల బరిలో ఉన్న ఆయనకు ఇది రాజకీయంగా కొంత నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.