భారత్- జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ రంగంలో సహకార సంబంధాలను మెరుగుపర్చేందుకు దృష్టి సారిస్తామని తెలిపారు. భారత్-జపాన్ సంబంధాలు ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొన్నారు.
ఈ మేరకు జపాన్ ప్రధాని సనాయె తకాయిచితో జరిగిన సంభాషణను ఎక్స్ వేదికగా మోదీ పంచుకున్నారు. జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టిన తకాయిచకి అభినందనలు తెలియజేశారు. ‘జపాన్ ప్రధాని సనాయె తకాయిచితో ఆత్మీయ సంభాషణ జరిగింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు గానూ ఆమెకు అభినందనలు తెలియజేశాను. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాల సంబంధాలు చాలా ముఖ్యమని అంగీకరించాం’ అని మోదీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
మరోవైపు ‘జపాన్- భారత్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం మీతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం’ అని సనాయె తకాయిచి పోస్ట్ చేశారు. జపాన్ దౌత్య, భద్రతా విధానాలకు యునైటెడ్ స్టేట్స్తో కూటమి మూలస్తంభమని సనాయె తకాయిచి ఎక్స్‌లో పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు.

More Stories
త్వరలో భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం .. ట్రంప్
చైనాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అర్హతలు
టర్కీలో పాక్- ఆఫ్ఘన్ శాంతి చర్చలు విఫలం