ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పిఎస్బి) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పెట్టుబడుల పరిమితి అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించిందని, దీనిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ను కూడా అభిప్రాయం కోరినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా కొలిక్కి రావాల్సి ఉందని చెప్పారు.
ప్రస్తుతం పిఎస్‌బిల్లో విదేశీ పెట్టుబడుల పరిమితి 20 శాతంగా ఉంది. అంటే, ఈ పరిమితిని రెట్టింపునకు పైగా పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. కాగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం 74 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉన్న సంగతి విదితమే. మరిన్ని విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం ద్వారా దేశంలో పెరుగుతున్న రుణ డిమాండ్‌కు అనుగుణంగా పీఎస్‌బీలు మూలధన నిధులు సమకూర్చుకోగలుగుతాయని కేంద్రం భావిస్తోంది.
ఈ పరిమితిని గణనీయంగా పెంచినప్పటికీ, కనీసం 51 శాతం వాటా కలిగి ఉండటం ద్వారా పీఎస్‌బీలపై నియంత్రణాధికారాలను మాత్రం ప్రభుత్వం కలిగి ఉండనుంది. ఈ సెప్టెంబరు 30 నాటికి విదేశీ పెట్టుబడులు అత్యధికంగా కెనరా బ్యాంక్‌లో 12 శాతంగా ఉండగా, అత్యల్పంగా యూకో బ్యాంక్‌లో దాదాపు సున్నాగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ బ్యాంకుల్లో కనీసం 49 శాతం వాటాకు తగ్గించుకోవాలనేది లక్ష్యం. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ సహా దేశంలో డజను పిఎస్బిలున్నాయి.
ఈ మార్చి నాటికి ఈ డజను పిఎస్‌బిల ఆస్తుల మొత్తం విలువ దాదాపు 1.95 లక్షల కోట్ల డాలర్లు. అంటే, మన కరెన్సీలో సుమారు రూ.171 లక్షల కోట్లు. దేశీయ బ్యాంకింగ్ రంగ మొత్తం ఆస్తుల్లో 55 శాతానికి సమానమిది. గడిచిన కొన్నేళ్లలో దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా భారత బ్యాంక్‌లు పటిష్టంగా పని చేయడంతో విదేశీ సంస్థలు ఇక్కడి విత్త సంస్థల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి.
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోకి ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ పెట్టుబడులే ఇందుకు నిదర్శనం. ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్ బ్లాక్‌స్టోన్ గ్రూప్ కేరళకు చెందిన ఫెడరల్ బ్యాంక్‌లో 9.99 శాతం వాటాను రూ.6,196 కోట్లకు దక్కించుకుంది. గల్ఫ్ ప్రాంత బ్యాంకింగ్ దిగ్గజం ఎమిరేట్స్ ఎన్డీబీ ఆర్బీఎల్ బ్యాంక్‌లో 60 శాతం వాటాను రూ.26,853 కోట్లకు చేజిక్కించుకుంది.
బ్యాంక్‌లో 20 శాతం వాటాను జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్ఎంబీసీ) రూ.13,483 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మధ్యనే తన వాటాను మరో 5 శాతం మేర పెంచుకుంది. ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంక్‌లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలైన వార్బర్గ్ పింకస్, అబుదాబీ ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ (ఏడీఐఏ) కలిసి రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.మరోవంక, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ ఎఫ్‌డిఐలను అనుమతించడం ద్వారా అక్కడి స్థానిక ఆర్థిక విధానాలపై ప్రభుత్వాలు నియంత్రణ కోల్పోయాయి. దీంతో ఆర్థిక సంక్షోభాలు ఏర్పాడిన ఘటనలు ఉన్నాయి. భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు వ్యవసాయ, ఇతర ప్రాధాన్యత రంగాల రుణాల జారీలో కీలకంగా ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోశిస్తోన్నాయి. పిఎస్‌బిల్లో ఎఫ్‌డిఐలు పెరిగితే ఈ లక్ష్యాలు నీరుగారనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More Stories
ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకునే ఫ్రేమ్‌వర్క్ లేని పాశ్చాత్య మీడియా
రష్యా సంస్థతో హెచ్ఏఎల్ విమాన తయారీ ఒప్పందం
టాటా ట్రస్ట్స్ లో మెహ్లి మిస్త్రీ ప్రవేశం నిరోధన