డ్రగ్స్‌పై బ్రెజిల్ భారీ ఆపరేషన్.. 64 మంది మృతి

డ్రగ్స్‌పై బ్రెజిల్ భారీ ఆపరేషన్.. 64 మంది మృతి
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పేరొందిన  బ్రెజిల్‌లో ఈ డ్రగ్స్ ముఠా ఆటకట్టించేందుకు ఆ దేశంలో ఎన్నడూ ఎరుగని ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. రియో డి జనీరో నగరంలో మంగళవారం రోజున జరిగిన ఈ ఆపరేషన్‌లో 2500 మంది బ్రెజిల్ పోలీసులు, సైన్యం డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న రెడ్ కమాండ్ అనే ముఠాపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడులు  బ్రెజిల్ చరిత్రలోనే అత్యంత హింసాత్మకమైన, భారీస్థాయి పోలీస్ ఆపరేషన్ అని స్థానిక అధికారులు వెల్లడించారు.
 
ఆ దేశంలో పెద్ద పెద్ద ముఠాలు, ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్లతో లింకులు ఏర్పాటు చేసుకుని వివిధ దేశాలకు మత్తుపదార్థాలను అక్రమ రవాణా చేస్తూ ఉంటాయి. ఈ దాడుల్లో పోలీసులు, డ్రగ్స్ ముఠా మధ్య తీవ్రమైన కాల్పులు చోటుచేసుకోవడంతో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ ఆపరేషన్‌లో 60 మంది డ్రగ్స్ ముఠాకు చెందిన వారు మరణించారు. 
 
ఇక డ్రగ్స్ ముఠా జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 81 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా 93 రైఫిళ్లు, అర టన్నుకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాయుధ‌ వాహ‌నాలు, హెలికాప్ట‌ర్లు, డ్రోన్ల‌తో పోలీసులు ఆ ఆప‌రేష‌న్ నిర్వ‌మించారు. నార్త‌ర్న్ బ్రెజిల్‌లో ఉన్న రెండు మురికివాడ‌ల్లో ఆ త‌నిఖీలు నిర్వ‌హించారు.
 
రియో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు స‌మీపంలో గ‌న్‌ఫైర్ శ‌బ్ధాలు వినిపించాయి. అనేక ప్రాంతాల నుంచి న‌ల్ల‌టి పొగ క‌మ్ముకున్న‌ది. డ్ర‌గ్ ముఠాల‌కు చెందిన బృందాల‌తో డ్రోన్ల‌తో ప్ర‌తిదాడుల‌కు దిగిన‌ట్లు పోలీసులు ఆరోపించారు. రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇది అతిపెద్ద ఆప‌రేష‌న్ అని గ‌వ‌ర్న‌ర్ క్లాడియో క్యాస్ట్రో తెలిపారు.  ఇక ఈ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో నేరస్తులు మరణించడంపై స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగానూ తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.  
 
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కాల్పుల శబ్దాల మధ్య ఆ ప్రాంతంలో మంటలు, పొగలు కనిపించాయి. ఈ ఆపరేషన్ కారణంగా 46 పాఠశాలలను మూసివేశారు. అంతేకాకుండా సమీపంలోని ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ రియో నైట్ క్లాసులను రద్దు చేసి.. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని విద్యార్థులకు సూచించారు.