బీహార్ ఎన్నికల ప్రచారం నుండి రేవంత్ తొలగింపు!

బీహార్ ఎన్నికల ప్రచారం నుండి రేవంత్ తొలగింపు!
ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బీహార్ మొత్తం తిరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇప్పుడు బీహార్‌  ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమై, ఎన్నికల ప్రచారం ఉవ్వెత్తున సమయంలో ఎక్కడ కనిపించడం లేదు. బీహార్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంకోసం భారీగా నిధులు సమకూర్చారని భావిస్తున్నప్పటికీ ఆయనను ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని పార్టీ అధిష్టానం స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది.
 
ఆయన ప్రచారంలో పాల్గొంటే నష్టమే తప్ప పార్టీకి లాభం లేదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. అందుకే ఆయనను షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం నుంచి తప్పించింది. తాజాగా ప్రచారం కోసం పార్టీ తరఫున ఖరారు చేసిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంత్‌రెడ్డి పేరు చేర్చలేదు. మొత్తం 40 మందితో క్యాంపెయినర్ల జాబితా విడుదల చేయగా ఇందులో తెలంగాణ నుంచి ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
 
మొదట సీఎం రేవంత్‌రెడ్డి పేరుతో పాటు స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఇద్దరు, ముగ్గురు మంత్రుల పేర్లు కూడా ఉండొచ్చని భావించారు.  సీఎం రేవంత్‌రెడ్డి గత నెలలో బీహార్‌లో పలుమార్లు పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన గతంలో బీహార్‌ కూలీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ‘బీహార్‌ ప్రజల డీఎన్‌ఏలోనే కూలీ ఉన్నది’ అంటూ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. 
 
బీహార్‌ ప్రజలు కూలీలు అనే అర్థం వచ్చేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ తీవ్రంగా మండిపడ్డారు. బీహార్‌ ప్రజలను కూలీలంటూ అవమానించిన రేవంత్‌రెడ్డిని బీహార్‌ నుంచి తరిమి కొడతామని, తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితి వచ్చినట్టయింది.ఆ వ్యాఖ్యలతో చాలా నష్టం జరిగిందని, ప్రజలు కాంగ్రెస్‌ను దోషిగా చూస్తున్నారని అక్కడి పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి బీహార్‌కు వచ్చి ప్రచారం చేస్తే పార్టీకి మరింత నష్టం తప్పదనే ఆందోళనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్టు తెలిసింది. అందుకే మళ్లీ తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నేతలు ఎవరు వచ్చినా అది పార్టీకి నష్టమే తప్ప ఏ మాత్రం లాభం ఉండదని అధిష్ఠానం పెద్దలు స్పష్టతతో ఉన్నట్టు సమాచారం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా నుంచి తప్పించినట్టుగా భావిస్తున్నారు.

బీహార్‌తో పాటు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి బీహార్‌ను వదిలిపెట్టి జూబ్లీహిల్స్‌ ఎన్నికపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం జూబ్లీహిల్స్‌ ఎన్నికలపై అంతర్గత సర్వేలు చేయించగా, ఈ సర్వేలన్నింటిలోనూ కాంగ్రెస్‌ ఓడిపోతుందనే రిపోర్ట్‌ వచ్చినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధిష్ఠానం ఇక్కడి నేతలను హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘బీహార్‌ సంగతి తర్వాత.. ముందు మీ రాష్ట్రంలోని ఉప ఎన్నికల్లో ఓడిపోకుండా చూసుకోండి’ అని హెచ్చరించినట్టు సమాచారం.