టీటీడీ పరకామణిలో చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఐడీకి ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని ఐవోగా నియమించాలని స్పష్టం చేసింది. కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు, అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది.డిసెంబర్ 2 నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
మరోవంక, చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీకి ఆదేశించింది. రవికుమార్, కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తులతో పాటు బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని స్పష్టం చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరేవారికి ఏమైనా బదలాయించారా? అనే విషయంపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదికను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ, సీఐడీకి స్పష్టం చేసింది.
మరోవైపు తిరుమల పరకామణి చోరీ కేసులో సాధు పరిషత్ సైతం ఇంప్లీడ్ అయింది. కాగా టీటీడీ పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై సీఐడీతో విచారణ జరిపించాలని పాత్రికేయుడు ఎం. శ్రీనివాసులు వేసిన వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.
సాధు పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపిస్తూ చోరీ కేసును లోక్‌అదాలత్‌లో హడావిడిగా రాజీ చేయించారని వాదించారు. పరకామణిలో భారీ అక్రమాలు జరిగాయని, అందుకు ఈ ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. అన్నీ బయటకు రావాలంటే సిట్‌తో దర్యాప్తు చేయించాలని కోరారు. ఇంప్లీడ్ పిటిషన్ వేశాక సాధు పరిషత్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఏ తప్పూ చేయకపోతే బెదిరించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. సాధు పరిషత్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు కోర్టు ఆదేశించింది.
ఇటీవల ఇదే కేసులో అప్పటి సహాయ విజిలెన్స్, సెక్యూర్టీ అధికారి (ఏవీఎస్వో) వై. సతీష్‌కుమార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో టీటీడీ పరకామణిలో చోటు చేసుకున్న చోరీ కేసు రాజీ చేసుకోవడానికి టీటీడీ, బోర్డు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పరకామణి విభాగం ఇంఛార్జి అధికారిగా చోరీ కేసులో రాజీ చేసుకునే అధికారం లోక్ అదాలత్ చట్ట ప్రకారం తనకు ఉందని తెలిపారు.
టీటీడీ చట్టం రాష్ట్ర శాసనమని, ఐపీసీ, సీఆర్పీసీ కేంద్ర చట్టాలని, చోరీ వ్యవహారంపై నమోదు చేసిన సెక్షన్లు రాజీకి అవకాశం ఉన్నవి అని పేర్కొన్నారు. కాబట్టే తాను ఈ కేసు రాజీ చేసుకోవడానికి టీటీడీ బోర్డు తీర్మానాలు అవసరం లేదని చెప్పారు. చోరీ ఘటనపై ఫిర్యాదు చేసింది తానేనని, సదుద్దేశంతో ఈ కేసును రాజీ చేసుకున్నానన్నీ తెలిపారు.
ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడిగా తాను రాజీకి ఒప్పుకున్నానని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. అయితే తాజాగా హైకోర్టు పరకామణి కేసు రాజీ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడం గమనార్హం. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసింది.

More Stories
బీహార్ ఎన్నికల ప్రచారం నుండి రేవంత్ తొలగింపు!
‘మొంథా’ తుపాను ప్రభావం, సన్నద్ధతపై నడ్డా ఆరా
బీహార్ ఎన్నికల ప్రచారంలో కనిపించని రాహుల్ గాంధీ!