ఓ చిన్న కరీబియన్ దేశంలో భవ్య రామమందిరాన్ని నిర్మించబోతున్నారు. 65 శాతం మంది కేఇస్తవులు ఉన్న ఆ దేశంలో ఓ ‘అయోధ్యా నగరి’ వెలియబోతోంది. భారత్‌లోని అయోధ్య దాకా వెళ్లలేని ఉత్తర అమెరికా రామభక్తులకు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో రామయ్య దర్శనమివ్వనున్నారు.
కరీబియన్ సముద్రపు సరిహద్దుల్లో 13 చిన్నచిన్న దేశాలు ఉన్నాయి. వాటిలోనే ఒకటి ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇందులో ట్రినిడాడ్, టొబాగో అనే రెండు ప్రధాన ద్వీపాలు ఉన్నాయి. ‘పోర్ట్ ఆఫ్ స్పెయిన్’ నగరం ఈ దేశపు రాజధాని. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు టూరిజమే ప్రధాన ఆదాయ వనరు. ఈ దేశంలో దాదాపు 14 లక్షల జనాభా ఉండగా, వారిలో ఇంచుమించు 3.50 లక్షల మంది హిందువులే.
అందుకే హిందువుల మనోభావాలను, సంప్రదాయాలను అక్కడి ప్రభుత్వం గౌరవిస్తుంది. 19వ శతాబ్దంలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ దేశానికి వలస వెళ్లి, అక్కడే స్థిరపడిపోయారు. ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రిగానూ భారత సంతతికి చెందిన కమలా పెర్సాద్ బిస్సేస్సార్ సేవలు అందిస్తున్నారు. పబ్లిక్ యుటిలిటీస్ శాఖ మంత్రిగానూ భారత సంతతికి చెందిన బ్యారీ శివ పాదరత్ ఉన్నారు.
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ప్రేమ్ భండారీ ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్’ (ఓఎఫ్‌ఆర్ఎం) అనే సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ ట్రినిడాడ్ అండ్ టొబాగో సహా చాలా దేశాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయోధ్య రామమందిరం తరహాలో ట్రినిడాడ్ అండ్ టొబాగోలోనూ రామ మందిరాన్ని నిర్మించాలని ప్రేమ్ భండారీ ముమ్మర ప్రచారం చేశారు.
ఈ ఆలయం నిర్మాణం జరిగితే, అయోధ్య దాకా వెళ్లలేని ఉత్తర అమెరికా రామ భక్తులంతా ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వచ్చి రామయ్యను దర్శించుకుంటారనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారు. దీనివల్ల ఆధ్యాత్మిక టూరిజం పెరుగుతుందనే అంశాలతో కూడిన నివేదికను ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వానికి సమర్పించారు.
ఈ ప్రయత్నాల ఫలితంగా ఈ ఏడాది ఆరంభంలోనే రామ్‌లల్లా విగ్రహ నమూనా అయోధ్య నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరింది. ఈ ఏడాది మే నెలలో దేశ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో రామ్‌లల్లా విగ్రహ నమూనాను ప్రేమ్ భండారీ, అయోధ్య శ్రీరామ్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్ అమిత్ అలఘ్ కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 10వేల మందికిపైగా రామభక్తులు పాల్గొన్నారు.
భవ్య రామమందిర నిర్మాణానికి తమ ప్రభుత్వం మద్దతు తప్పక ఉంటుందని ట్రినిడాడ్ అండ్ టొబాగో పబ్లిక్ యుటిలిటీస్ శాఖ మంత్రి బ్యారీ శివ పాదరత్ వెల్లడించారు. అయోధ్య నుంచి రామ్ లల్లా విగ్రహ నమూనాను తీసుకొచ్చిన వారితో పాటు స్థానిక హిందూ మత పెద్దలతో ఆలయ నిర్మాణ ప్రతిపాదనల గురించి చర్చిస్తున్నట్లు తెలిపారు. భారతదేశం అవతల హిందూ సంప్రదాయాల పరిరక్షణ కోసం చొరవ చూపుతున్న సంస్థలకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
కరీబియన్ దేశాల్లో హిందూ ఆలయాలకు నెలవుగా ట్రినిడాడ్ అండ్ టొబాగోను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణం వల్ల దేశ పర్యాటకం సైతం పెరుగుతుందని పేర్కొంటూ ఆ మందిరాన్ని సాంస్కృతిక ప్రచారం, హిందూవర్గ సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చని బ్యారీ శివ పాదరత్ తెలిపారు.
ఉత్తర అమెరికా ప్రాంతంలోని ప్రవాస భారతీయులంతా భవిష్యత్తులో తమ దేశంలోని రామాలయాన్ని దర్శించుకోవచ్చని చెప్పారు. కాగా, రామమందిరం నిర్మాణ సంబంధిత ప్రణాళికల వివరాలను ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం ఇంకా కొన్ని నెలల్లోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

More Stories
2026 “ఆసియాన్-భారత్ సముద్ర సహకార సంవత్సరం”
కంబోడియా-థాయ్ శాంతి ఒప్పందంతో అరుదైన ఖనిజాలపై ట్రంప్!
ఓ మతానికి ముడిపెట్టి గోమాతను అవమానించడం సరికాదు