ఐదేళ్ల తర్వాత భారత్​-చైనా మధ్య విమాన సర్వీసులు

ఐదేళ్ల తర్వాత భారత్​-చైనా మధ్య విమాన సర్వీసులు

గల్వాన్‌ ఘర్షణల తర్వాత భారత్‌-చైనా సంబంధాలు తిరిగి గాడినపడుతున్న వేళ ఐదేళ్ల విరామం తర్వాత ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరానికి రాత్రి 10గంటలకు తొలివాణిజ్య విమానం బయలుదేరింది. తర్వాత ఇండిగో విమానం చైనా వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రయాణికులు దీపాలు వెలిగించి వేడుక నిర్వహించారు.

కోల్​కతా ఆదివారం రాత్రి 10 గంటలకు ఇండిగో 6E1703 విమానం 176 మంది ప్రయాణికులతో బయలుదేరింది. సోమవారం ఉదయం 4 గంటలకు గ్వాంగ్​జౌలో ల్యాండ్ అయ్యింది. గ్వాంగ్​జౌలో దిగే కొద్ది సేపటికి ముందే చైనా నుంచి ఇండియాకు విమానం బయలుదేరింది. ఢిల్లీ-గ్వాంగ్​జౌ మధ్య విమాన సర్వీసులు నవంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. 

అలాగే షాంఘై-దిల్లీ మధ్య నవంబవర్ 9 నుంచే ప్రారంభమవుతాయి. ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడంపై కోల్​కతాలోని చైనా డిప్యూటీ కాన్సుల్ జనరల్ క్విన్ యోంగ్ స్పందించారు. భారత్​-చైనా సంబంధాలకు చాల ముఖ్యమైన రోజుని తెలిపారు. కరోనా, గల్వాన్‌ సంఘర్షణల కారణంగా భారత్‌, చైనా విమాన సర్వీసులు నిలిపివేశారు. 

అయితే ఐదేళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు గతంలో చైనా కాన్సుల్ జనరల్ జు వీ పేర్కొన్నారు. అందుకోసం భారత్​ అధికారులతో చర్చలు జరపుతున్నామని తెలిపారు. కరోనా​కు ముందు బీజింగ్‌, షాంఘై, గ్వాంగ్‌జౌ, కున్మింగ్‌ నుంచి భారత్‌లోని డిల్లీ, ముంబయి, కోల్‌కతా, ఇతర నగరాలకు వారానికి 50 విమాన సర్వీసులుండేవి చెప్పారు. 

ఆ సేవలను తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1నాటికి భారత్​-చైనా మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. జనవరిలో భారత్‌ విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ చైనాను సందర్శించిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మొదట ఈ ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాల మధ్య విమాన సేవలను తిరిగి ప్రారంభించడానికి సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు పేర్కొంది. 

కాగా, ఇటీవల లద్దాఖ్‌ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం విషయంలో రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఆ సందర్భంగా నేరుగా విమాన సర్వీసుల అంశం చర్చకు వచ్చాయి. గత నెలలో మోదీ చైనా పర్యటనలోనూ విమాన సేవలను తిరిగి ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ అంశంపై ఇరు దేశాలు పలు దఫాలుగా చర్చలు జరిపాయి. ఇటీవల వీటిని పునరుద్ధరించేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ కూడా వెల్లడించింది.