“గోవుల గొప్పతనం గురించి మన వేదాలు చెబుతూనే ఉన్నాయి. ‘గావో విశ్వస్య మాతర:’ అంటే ‘ఆవులు విశ్వానికే తల్లి’ అని అర్థం. ఈ సూక్తిని మనం నిజం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోవులు కేవలం పాలను మాత్రమే కాకుండా, వాటి శ్వాస, ఉచ్ఛ్వాసల మధ్య గడిపే సమయం మనిషిలోని సగం ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు” అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
“ఎప్పుడూ అధికారిక కార్యక్రమాలతో ప్రధాని మోదీ బిజీగా ఉంటారు. అయితే ప్రధాని తన నివాసంలో గోవులను పెంచుకుంటూ, వాటితో గడిపే సమయంతో మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుంటున్నాన నాకు చెప్పారు. ఇది గోవుల ప్రాముఖ్యతకు ఒక మంచి ఉదాహరణ” అని కేంద్ర మంత్రి చెప్పారు.
“దురదృష్టవశాత్తూ, వ్యవసాయ క్షేత్రాలు, భూకమతాలు తగ్గిపోవడంతో గోవుల స్వేచ్ఛకు ఇబ్బందులు వస్తున్నాయి. ఒకప్పుడు పచ్చిక బయళ్లలో గోవులు స్వేచ్ఛగా తిరిగేవి. ఇప్పుడు ఇరుకు స్థలంలో కట్టేస్తున్నారు. గోశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వాటికి కావాల్సినంత స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయింది” అని కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
గోవుల రక్షణ కేవలం గో పరిరక్షకుల బాధ్యత మాత్రమే కాదని, సమాజం మొత్తం ఆ బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. గోవుల ఉత్పత్తుల ప్రాధాన్యత గురించి చాలామందికి తెలియదని పేర్కొంటూ ఆశ్చర్యకరంగా, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా మన గోవుల ఉత్పత్తులను వాడుతున్నాయని గుర్తు చేశారు. అంతేకాకుండా, గోవుల వ్యర్థాలతో వ్యవసాయం చేయడం ద్వారా భూమి సారాన్ని పెంచుతున్నాయని చెప్పారు.
“ఈ రోజు గో సేవ విభాగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో, తల్లిదండ్రులను, వారి పిల్లలను భాగస్వామ్యం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఇది రాబోయే తరాలకు గో సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మన గోమాతకు ఇంతటి ప్రాధాన్యత ఉందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాటిని రక్షించుకోవాలి” అని కిషన్‌రెడ్డి సూచించారు.
‘గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం’పై నిర్వహించిన రాష్ట్రస్థాయి పరీక్షా పోటీల విజేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బహుమతులు ప్రదానం చేస్తూ గోసంతతిని కాపాడుకోవడం మత విశ్వాసం కానేకాదని స్పష్టం చేశారు. గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లేనని, ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్లేనని పేర్కొన్నారు. ఇస్లాంలోనూ కొందరు మత పెద్దలు గోవును పక్కన పెట్టుకుని నమాజ్ చేసిన దృశ్యాలను తాను చూశానని తెలిపారు.

More Stories
తెలంగాణలో నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అయోధ్య తరహా రామ మందిరం
2026 “ఆసియాన్-భారత్ సముద్ర సహకార సంవత్సరం”