* సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్.. ఏపీ, ఒడిశాకు రెడ్ అలర్ట్.. తెలంగాణ, చెన్నైకి భారీ వర్ష సూచన
నైరుతి-ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య మొంథా తుపాను కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయవ్యంగా కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు అని హెచ్చరించారు. విశాఖ, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పుఅని తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది. ఇది ‘మొంథా’ తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను తీరం దగ్గరకు వచ్చే కొద్దీ మరింత ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం చెన్నైకు 480 కి.మీ. దూరంలో, కాకినాడకు 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.
పశ్చిమ వాయవ్యంగా కదులుతూ రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. సముద్రంలో మీటరు ఎత్తున అలలు ఎగసిపడతాయని తుపాను హెచ్చరిక కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథకుమార్ తెలిపారు.
‘మొంథా’ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. కాకినాడలో ఈ ఉదయం చిరు జల్లులు పడగా, ఉదయం 10 గంటల సమయం తర్వాత వర్షం తీవ్రత పెరిగింది. మొంథా తుపాను ప్రభావంతో విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి.
తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీలోని తీరప్రాంతాల్లోని బీచ్లు మూసివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విపత్తు ప్రతిస్పందన బృందాలు మోహరించారు.
మరోవైపు ఒడిశాలోని ఎనిమిది జిల్లాల్లో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మల్కాన్గిరి, కోరాపుట్, నబరంగ్పూర్, రాయగడ, గజపతి, గంజాం, కంథమల్, కలహండి.. జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మొంథా తుఫాను నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరికి ఐఎండీ వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, సమీప జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తుఫాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో 5 సెంటీమీటర్ల నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

More Stories
కౌలు రైతుల సమస్యలు పట్టని కూటమి ప్రభుత్వం
విద్యార్థులే లేని 7,993 పాఠశాలల్లో 20,817 మంది ఉపాధ్యాయులు
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అయోధ్య తరహా రామ మందిరం