2026 “ఆసియాన్-భారత్ సముద్ర సహకార సంవత్సరం”

2026  “ఆసియాన్-భారత్ సముద్ర సహకార సంవత్సరం”
విద్య, పర్యాటకం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2026ను “ఆసియాన్-భారత్ సముద్ర సహకార సంవత్సరం”గా ప్రకటించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవల్సిన ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 21వ శతాబ్దం భారత్‌, ఆసియాన్‌ దేశాల శతాబ్దమని చెబుతూ “21వ శతాబ్దం మనది – ఇది భారతదేశం, ఆసియాన్ కు చెందినది” అని ప్రధాని ప్రకటించారు.
 
ఆదివారం నాడు మలేసియాలో కౌలాలంపుర్‌ జరుగుతోన్న ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్‌గా ప్రధాని ప్రసంగిస్తూ భారతదేశం, ఆసియాన్ ప్రాంతం మధ్య లోతైన వ్యూహాత్మక, సాంస్కృతిక, ఆర్థిక భాగస్వామ్యాన్ని గుర్తుచేశారు. భాగస్వామ్య చరిత్ర, విలువలు, వాణిజ్య సంబంధాలను నొక్కి చెబుతూ, భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఆసియాన్ ఒక కీలకమైన స్తంభంగా అభివర్ణించారు. 
 
భారత్, ఆసియాన్ కేవలం భౌగోళికంగా మాత్రమే కాకుండ సంస్కృతి, విలువల పరంగానూ దగ్గరగా ఉన్నాయని చెప్పారు. ఆసియాన్ కేంద్రీకరణకు, ఇండో-పసిఫిక్‌పై దాని దృక్పథానికి భారతదేశపు మద్దతును పునరుద్ఘాటించారు.  రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలు మాత్రమే కాక ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాలు కూడా బలంగా ఉన్నాయని చెబుతూ ఆసియాన్ భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో కీలక స్తంభమని తెలిపారు. 
 
ఆసియాన్ సెంట్రాలిటీని, ఇండో పసిఫిక్ దృష్టికోణాన్ని భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టమైందని ప్రధాని తెలిపారు. ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల్లో భారత్-ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నిరంతరం బలపడుతోందని మోదీ పేర్కొన్నారు. ఈ బలమైన భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి, అభివృద్ధికి మూలం అవుతోందని స్పష్టం చేశారు.
“ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045”, “విక్షిత్ భారత్ 2047” ఉమ్మడి దృక్పథం ప్రాంతాలు, మానవాళి రెండింటికీ ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 1995లో సంప్రదింపుల భాగస్వామ్యం నుండి ప్రస్తుత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం వరకు, ఆసియాన్‌తో భారతదేశపు దీర్ఘకాలిక సంబంధం, ఇండో-పసిఫిక్‌లో ప్రాంతీయ స్థిరత్వం, శ్రేయస్సు,  సమ్మిళిత వృద్ధికి దేశం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని చెప్పారు.
 
ప్రధానమంత్రి మోదీ ప్రపంచ స్థిరత్వం, అభివృద్ధికి మూలంగా భారతదేశం-ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్నిప్రస్తావిస్తూ ముఖ్యంగా అనిశ్చిత సమయాల్లో. రెండు ప్రాంతాల మధ్య సహకారం క్రమంగా పెరిగిందని, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ భద్రతలో ఉమ్మడి లక్ష్యాలను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆసియాన్ సమ్మిట్ ఇతివృత్తమైన “సమ్మిళితత్వం, స్థిరత్వం” గురించి ప్రసంగిస్తూ, డిజిటల్ చేరిక, ఆహార భద్రత, స్థితిస్థాపక సరఫరా గొలుసులు వంటి చొరవలకు భారతదేశపు నిబద్ధతను మోదీ నొక్కి చెప్పారు.
 
విపత్తు ప్రతిస్పందన, మానవతా సహాయం, సముద్ర భద్రత, నీలి ఆర్థిక వ్యవస్థలో ఆసియాన్ భాగస్వాములతో పాటు భారతదేశపు క్రియాశీల పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో, తైమూర్-లెస్టేను ఆసియాన్‌లో కొత్త సభ్యునిగా స్వాగతించారు. దీనితో ఆ కూటమి సభ్యత్వం 11కి చేరుకుంది. థాయిలాండ్ రాణి తల్లి మరణం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. “భారతదేశం, ఆసియాన్ కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మనం భౌగోళికం, సంస్కృతి, విలువలను పంచుకుంటాము” అని ఆయన పేర్కొన్నారు.