ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి పంపిస్తాం

ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి పంపిస్తాం

బిహార్‌లో ఉన్న ప్రతి ఒక్క చొరబాటుదారుడిని గుర్తించి, వారి స్వస్థలాలకు తిరిగి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చొరబాటుదారులను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తుంటే వారిని రక్షించేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారని విమర్శించారు. బిహార్‌లోని ఖగారియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా ఆర్జేడీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 

ప్రధాని మోదీ, సీఎం నీతీశ్ కుమార్‌లు బిహార్ అభివృద్ధికై పనిచేస్తుంటే, లాలూ తన కుటుంబం బాగు కోసం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. ఎన్డీఏ హయాంలో బిహార్‌లో నేరాలు తగ్గాయని చెప్పారు.

“లాలూ, రబ్రీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, జంగిల్ రాజ్ పాలన మళ్లీ వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బిహార్ అభివృద్ధి గురించి దేశం మొత్తానికి తెలుస్తుంది. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 4వ స్థానానికి చేర్చారు. 2027 కంటే ముందే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది”, అని తెలిపారు. 

ప్రధాని మోదీ దేశాన్ని సురక్షితంగా మార్చారని చెబుతూ యూపీఏ హయాంలో పాకిస్థాన్ తరచూ మనపై దాడి చేసేది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సోనియా, మన్మోహన్‌, లాలూ మౌనంగా ఉండేవారని ధ్వజమెత్తారు. ఇటీవల రాహుల్ బాబా చొరబాటుదారులను రక్షించేందుకు యాత్ర చేపట్టారని పేర్కొంటూ బిహార్‌ నుంచి చొరబాటుదారులను వెళ్లగొట్టాలా? లేదా? మీరే‍(ప్రజలు) చెప్పండి అని బీహార్ ప్రజలను అడిగారు.

“బిహార్లో 2005 నుంచి 2025 వరకు నేరాలు గణనీయంగా తగ్గాయి. గత 10 సంవత్సరాల్లో మారణహోమం జరగలేదు. 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ భారతదేశంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చారు. అయోధ్యలో రామ్ లల్లా ఆలయానికి పునాది రాయి వేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. రాహుల్, మమత, లాలూ అంతా రాముడి ఆలయాన్ని వ్యతిరేకించారు. కాగా మా మోదీ హయాంలోనే బిహార్ వారసత్వాన్ని చాటే నలంద విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాం” అని అమిత్ షా తెలిపారు.