పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి భారత్ తలపెట్టిన భారీ భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ త్రివిధ దళాల విన్యాసాల కారణంగా పాక్ అప్రమత్తమైంది. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు భారత్ చేపడుతున్న త్రిశూల్ సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు అత్యవసర నోటిఫికేషన్ నోటమ్ జారీ చేయడం గమనార్హం.
పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని గుజరాత్‌లోని వివాదాస్పద ప్రాంతమైన సర్‌క్రీక్ సమీపంలో భారత్ ఈ భారీ విన్యాసాలు చేపట్టేందుకు నోటమ్ జారీ చేసింది. భారత్ నోటమ్ జారీ చేయగానే పాకిస్తాన్ అక్టోబర్ 28-29 తేదీల్లో తమ కేంద్ర, దక్షిణ గగనతలంలో విమాన మార్గాలపై ఆంక్షలు విధించింది. దీనికి పాక్ ఎలాంటి కారణం చెప్పకపోయినా భారత్ సరిహద్దుల్లోని కదలికలను నిశితంగా గమనిస్తున్నామనే సంకేతాన్ని ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాల్గొనే ఈ విన్యాసాల లక్ష్యం.. ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను ప్రదర్శించడం, ఆత్మనిర్భరత, ఆవిష్కరణలను చాటడం, దక్షిణ కమాండ్ దళాలు క్రీక్, ఎడారి ప్రాంతాలు, సౌరాష్ట్ర తీరంలో ఉభయచర ఆపరేషన్లతో సహా సంక్లిష్ట భౌగోళిక ప్రాంతాలలో ఉమ్మడి కార్యకలాపాలను చాటనున్నాయి.
ఈ విన్యాసాల కోసం ఏకంగా 28 వేల అడుగుల ఎత్తు వరకు గగనతలాన్ని రిజర్వ్ చేసుకున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున త్రివిధ దళాలు కలిసి విన్యాసాలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్ ఈ విన్యాసాలను సర్‌క్రీక్-సింధ్-కరాచీ అక్షానికి దగ్గరగా నిర్వహించడం అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత సంతరించుకుంది.
సర్‌క్రీక్ అనేది గుజరాత్, సింధ్ (పాకిస్తాన్) మధ్య ఉన్న 96 కిలోమీటర్ల పొడవునా ఉండే చిత్తడి ప్రాంతం. సముద్ర మార్గాలను ప్రభావితం చేసే ఈ ప్రాంతం రెండు దేశాలకు అత్యంత కీలకం. సర్‌క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ తమ సైనిక మౌలిక సదుపాయాలను పెంచుతోందని ఇటీవల ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లు వచ్చాయి.
దీనిపై ఇటీవల విజయదశమి సందర్భంగా తీవ్రంగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సర్‌క్రీక్ సెక్టార్‌లో ఏదైనా వక్రబుద్ధి చూపించడానికి పాకిస్తాన్ సాహసిస్తే దానికిచ్చే సమాధానం చరిత్రను, భౌగోళిక రూపురేకలను మార్చేస్తుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు చేసిన కొన్ని రోజులకే పాక్ సరిహద్దుకు ఇంత దగ్గరగా భారీ సైనిక విన్యాసాలను భారత్ చేపట్టడం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు స్పష్టం చేస్తోంది.

More Stories
కశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన
అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లా వలసదారులు!