ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం

ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం

“ఈ దశాబ్దం మోదీదే, అంటే ఆటోమెటిగ్గా భారతీయులదే” అని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజల సాధికారత, అభివృద్ధి, సంస్కరణలతో దూసుకుపోతుందని పేర్కొన్నారు.

“ప్రధాని మోదీ 2000 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు 11 ఏళ్లుగా ప్రజల ఆశీస్సులతో ప్రధానిగా కొనసాగుతున్నారు. మరో నాలుగు సంవత్సరాలు కూడా ఆయనే ప్రధానిగా ఉంటారు. ఆయన నాయకత్వంలో దేశం బలంగా ముందుకు వెళ్తోంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా, భారత రాజకీయాల్లో కీలకమైన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు నమ్మకం వ్యక్తం చేశారు. “బిహార్ సీఎం నీతీశ్ కుమార్, అధికార కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తాను” అని తెలిపారు. దేశ అభివృద్ధి దిశగా ఎన్డీయే తీసుకున్న నిర్ణయాలు ప్రజలలో నమ్మకాన్ని పెంచాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

ఎన్డీయే ప్రభుత్వాన్ని “ప్రగతిశీల కూటమి”గా చంద్రబాబు అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల సాధికారతే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు ప్రజల సేవింగ్స్‌ను పెంచుతున్నాయని, చిన్న వ్యాపారాలు, ఎంఎస్‌ఎంఈ రంగం లాభపడుతున్నాయని చెప్పారు. ‘‘ప్రజల జీవితాల్లో సాంకేతికతతో కూడిన మార్పు తీసుకురావడమే లక్ష్యం’’ అని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒకే ఏడాదిలో ‘సూపర్ సిక్స్‌’ హామీలను విజయవంతంగా అమలు చేసిందని చంద్రబాబు వెల్లడించారు. ‘‘రాష్ట్రానికి కేంద్ర సహకారం లభిస్తే అభివృద్ధి వేగం రెట్టింపు అవుతుంది. డబుల్ ఇంజిన్‌ మోడల్‌ దేశ అభివృద్ధికి పునాదిగా నిలుస్తోంది’’ చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణం, వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్‌, ఉద్యానం వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచేందుకు ప్రభుత్వం అనుకూల వాతావరణం సృష్టిస్తోందని వివరించారు.

దుబాయ్‌ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ వ్యాపారవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. “వచ్చే నెలలో విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానించాను” అని తెలిపారు. అలాగే, ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన వచ్చే నెలలో జరగనున్నట్లు వెల్లడించారు. “గత 15 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మరో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం” అని ఆయన వివరించారు.

 రాష్ట్రంలో ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. “ఇప్పటికే 750కు పైగా ప్రభుత్వ సేవలను వాట్సప్‌ ద్వారా అందిస్తున్నాం. ఇది పారదర్శకతకు, సమర్థతకు చిహ్నం” అని చెప్పారు. సాంకేతికత ఆధారంగా పాలనను పునర్నిర్మిస్తున్నామని తెలిపారు.

 ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ప్రభావం పెరుగుతోందని చంద్రబాబు గర్వంగా చెప్పారు. “ఒకరోజు ఈ గ్రహంపై అత్యంత ప్రభావవంతమైన సమాజంగా తెలుగు కమ్యూనిటీ నిలుస్తుంది. ఆ దిశగా మేము కృషి చేస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరణలు, పరిశోధన, పరిశ్రమల కేంద్రంగా మలచాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.