వచ్చే వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం 10 నుంచి 15 రాష్ట్రాలలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను చేపట్టనుందని తెలిసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను మొదటగా ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బంగాల్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కనుక ఈ రాష్ట్రాల్లో మొదటిగా ఎస్ఐఆర్ చేపట్టే అవకాశం. వచ్చే వారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ తొలి దశ ఎస్ఐఆర్పై ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినా లేదా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రక్షాళన ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మలి దశలో ఉంటుందని వెల్లడించాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో రెండు సార్లు కాన్ఫరెన్స్ నిర్వహించింది. మెజార్టీ రాష్ట్రాలలో చివరిసారిగా 2002-04 మధ్య ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టారు.
ఇదిలా ఉండగా బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం ముగిసింది. దాదాపు 7.42 కోట్ల ఓటర్లతో తుది జాబితా సెప్టెంబర్ 30న ఈసీ ప్రచురించింది. ఓటర్ల జాబితాలను తమ వెబ్సైట్లలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. నకిలీ ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా ఈసీ ఈ ఎస్ఐఆర్ చేపట్టింది. అంతేకాదు ఈ ప్రక్రియ ద్వారా విదేశీ అక్రమ వలసదారులను కూడా గుర్తించింది.
బంగ్లాదేశ్, మయన్మార్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చే వారం తమిళనాడులో ప్రారంభంమవుతుందని భారత ఎన్నికల సంఘం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. అయితే చెన్నైలోని టి నగర్ నియోజకవర్గంలో 13,000 మంది ఏఐఏడీఎంకే మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఓ మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు.

More Stories
ఓ గిరిజన మహిళా హత్యతో బంగ్లా వలసదారుల గ్రామం దగ్ధం
ఆపిల్ యాప్ స్టోర్‌లో ‘సంచార్ సాథీ’ హవా
బీఎల్వోలకు వస్తున్న బెదిరింపులపై సుప్రీం సీరియస్