ప్రభుత్వంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగుల ఆధార్, సెల్‌ఫోన్ నంబర్‌తోసహా పూర్తి వివరాలను శనివారం అర్ధరాత్రిలోగా ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపించారు. పోర్టల్‌లో వివరాలు పొందపర్చని ఉద్యోగుల అక్టోబర్ నెల వేతనాలను విడుదల చేయబోమని హెచ్చరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో శాశ్వత, తాతాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెలా 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్‌ఎంఐఎస్)లో నమోదు చేయాలని గత నెల సెప్టెంబర్‌లో ఉత్తర్వు లు జారీ అయ్యాయి. ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు కూడా పోర్టల్‌లో నమోదు చేయలేదు. 5.21 లక్షల మంది శాశ్వత ఉద్యోగులకుగాను 2.22 లక్షల మంది వివరాలే నమోదయ్యాయి.
ఇక తాత్కాలిక ఉద్యోగుల్లో 4.93 లక్షల మందికిగాను 2.74 లక్షల మంది వివరాలే నమోదు చేశారు. ఏ ఒక శాఖ కూడా వందశాతం ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖలు, సంస్థ లు, పీఎస్‌యూలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్, దినసరి వేతనాలకు పనిచేసే వివిధ రకాల ఉద్యోగుల పూర్తి వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదుచేయాలని మరోసారి ఆదేశించారు.
కొన్ని కార్యాలయాల్లో తాతాలిక ఉద్యోగులు మానేసినా, అనధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లినా వారి పేర్ల తో వేతనాలు డ్రా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల వివరాలను నమోదు చేయడం ద్వారా ఎంతమంది పనిచేస్తున్నారనే స్పష్టమైన వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలను నమోదు చేయడం వల్ల వేతనాల చెల్లింపులో పారదర్శకత ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.కాగా, ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులపై అవగాహన ఉండదు. ఇప్పటికే మూడుసార్లు ఆధార్‌కార్డు అప్‌డేట్ చేయాలన్నారు. ప్రభుత్వం వద్దే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల సమాచారముంటుంది. ఏజెన్సీల ద్వారా అప్‌డేట్ చేయవచ్చు. లేదా ఆ ఏజెన్సీలను రద్దుచేయవచ్చు. అలా చేయకుం డా ఉద్యోగుల వేతనాలు కట్ చేస్తామనడం అత్యంత దారుణమని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Stories
ప్రపంచవ్యాప్తంగా ‘హిందూ జీవన విధానం’కు ఆదర్శంగా నిలుద్దాం
ప్రజా సమస్యలపై నెలరోజుల అసెంబ్లీ… రేవంత్ కు బిజెపి సవాల్
అసెంబ్లీ ప్రజాపక్షం నిలబడాలని బిజెపి నిర్ణయం