అదానీ గ్రూప్ కంపెనీల్లో తమ సంస్థ పెట్టుబడుల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలను ఎల్ఐసీ తోసిపుచ్చింది. పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ఎల్ఐసీ వివరణాత్మకంగా పోస్ట్ చేసింది. పెట్టుబడుల అంశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇతర శాఖల ప్రమేయం గానీ లేదని స్పష్టం చేసింది.
ఎల్ఐసీ బోర్డు ఆమోదించిన విధానాలు అనుసరించి పెట్టుబడులపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని ఎల్ఐసీ పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రమాణాలు ఎల్ఐసీ పాటిస్తూ వస్తోందని, అలాంటి సంస్థపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికింది. ఓవైపు అప్పులు, మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వేళ ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనం వెలువరించింది.
ప్రభుత్వ అధికారుల నుంచి ప్రణాళిక మేరకే ఎల్ఐసీ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని ఎల్ఐసీ పేర్కొనడం గమనార్హం. జీవిత బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసీ ఒక ప్రభుత్వ సంస్థ. మన దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టింది. 2014లో దీని మొత్తం పెట్టుబడులు రూ.1.56 లక్షల కోట్లు. కాగా ఇది ప్రస్తుతం రూ.15.6 లక్షల కోట్లకు పెరిగింది.
అంటే కేవలం పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. ఎల్ఐసీకి అదానీతోపాటు రిలయన్స్, ఐటీసీ, టాటా గ్రూపు కంపెనీల్లోనూ పెద్ద మొత్తంలో వాటాలు ఉన్నాయి. గౌతమ్ అదానీపై, అతని కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. హిండెన్‌బర్గ్ సంస్థ 2023 జనవరిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు ఆ గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీలపైన తీవ్ర ఆరోపణలు చేసింది.
అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వంటి లిస్టెడ్ కంపెనీల్లో నిధుల మళ్లింపునకు అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్‌స్టోన్ ట్రేడ్‌లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను అదానీ గ్రూప్ వినియోగించిందని హిండెన్బర్గ్ పేర్కొంది. ఈ ఆరోపణలపై సుదీర్ఘమైన దర్యాప్తు చేపట్టిన సెబీ, మదుపర్లను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరగలేదని స్పష్టం చేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన జరగలేదని పేర్కొంటూ, అదానీ కంపెనీలకు క్లీన్చిట్ ఇచ్చింది.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం