ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు

ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు

* 28 సాయంత్రానికి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం

ఏపీకి ‘మొంథా’ తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయగుండంగా మారింది. అండమాన్‌ దీవులకు పశ్చిమ-నైరుతి దిశలో దాదాపు 440 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఇది దాదాపు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 27న ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మీదుగా తుపానుగా బలపడే అవకాశం ఉంది. తరువాత ఇది వాయవ్య దిశగా, అనంతరం ఉత్తర-వాయవ్య దిశగా ప్రయాణించి 28న ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ 28 సాయంత్రానికి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. 

ఈ తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో స్థిరమైన ఈదురు గాలులు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల పడే అవకాశముంది.

‘మొంథా’ తుపాను దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసింది. సముద్రతీరాలు, నదుల్లో చేపలవేట, బోటింగ్ కార్యకలాపాలు నిలుపుదల చేసింది. బీచ్‌లకు పర్యాటకులు రాకుండా చూడాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ ప్రకటన జారీ చేశారు.

మొంథా తుపాను నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కలెక్టర్లకు ప్రభుత్వం రూ.14 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు జిఓ ఆర్‌టి నెంబరు 111ను విపత్తుల నిర్వహణ శాఖ (రెవెన్యూ) విడుదల చేసింది.  ఆయా నిధులను శిబిరాలకు ప్రజలను తరలించేందుకు, రక్షిత మంచినీరు అందించడం, ఆహారం సరఫరా, పాలు, ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్యం మెరుగుదలకు ఉపయోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

ప్రభావిత జిల్లాల కలెక్టర్లలతో అనకాపల్లి కలెక్టర్‌ కార్యాలయం నుండి హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాని ఆమె కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112, 1070, లేదా 1800-425-0101 నంబర్లకు సంప్రదించాలని చెప్పారు.