డిజైన్‌ లోపంతోనే స్లీపర్ బస్సుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు!

డిజైన్‌ లోపంతోనే స్లీపర్ బస్సుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు!
* చైనా, జర్మనీలలో  స్లీపర్ బస్సుల నిషేధం

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి  పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇదేతరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇవే కాదు గత కొన్నేళ్లుగా స్లీపర్‌ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వీటి నిర్వహణకు కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.  అయినా అధికారులు స్లీపర్ బస్సులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.  అయితే చైనా, జర్మనీలో స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించారు. అక్కడి కోర్టులు కూడా ప్రభుత్వాల నిర్ణయాలను సమర్థించాయి.
ప్రజల ప్రాణాలు పోతున్నా మన దగ్గర మాత్రం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేకపోతోంది. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్‌ బస్సు ప్రమాదాలు జరిగ్గా ఏకంగా 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2012లో వీటిపై చైనా నిషేధం విధించింది.  ఇక కొన్ని దేశాలు స్లీపర్‌ బస్సుల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. భద్రతా కారణాలు పేర్కొంటూ 2006లో జర్మనీ బ్యాన్ చేసింది. స్లీపర్ బస్సుల వినియోగంపై వియత్నాంలో కూడా పెద్ద ఎత్తిన చర్చ జరుగుతోంది. 
భారత్‌లో మాత్రం ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించి చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా స్లీపర్‌ బస్సుల్లో 2×1 సీటింగ్‌ ఉంటుంది. 30 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్‌ బస్సులైతే 36-40 మంది ప్రయాణించవచ్చు.  ఒక్కో బెర్త్‌ ఆరు అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. అయితే బెర్త్‌లను అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ సమస్య. ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండటంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు. 
 
స్లీపర్‌ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక, స్లీపర్‌ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది. సాధారణంగా వీటి ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటుంది. 
 
ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒక వైపునకు ఒరిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను చేరడం కష్టంగా మారుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు కూడా ఆటంకం కలుగుతోంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు.
 
ఇలాంటి డబుల్ డెకర్ బస్సుల ఎత్తు ఎక్కువగా ఉండటంతో సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బస్సుకు స్థిరత్వం తగ్గుతుంది. దీంతో ఎక్కువ వేగంగా వెళ్లినా, అకస్మాత్తుగా బ్రేక్ వేసినా ఒక వైపుకు పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్లీపర్ బస్సుల ప్రమాదాలు జరిగినప్పుడు మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
 
300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణాలకు స్లీపర్‌ బస్సులను అధికంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి. దీంతో డ్రైవర్‌కు అలసట లేదా మగత వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. అధునాతన బస్సుల్లో డ్రౌజీనెస్‌ అలర్ట్‌ సిస్టమ్‌లను ఏర్పాటుచేస్తున్నా, వాటి పనితీరు, సామర్థ్యంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. 
 
డ్రైవింగ్‌ సమయంలో తాము నిద్ర మత్తులో ఉంటున్నామని 25 శాతం మంది డ్రైవర్లు అంగీకరించినట్లు 2018లో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం 6 గంటల్లోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ప్రమాదాల సమయంలో మొదటి రెండు నిమిషాల్లో ప్రతిస్పందించే తీరే అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. 
 
సాధారణంగా స్లీపర్‌ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు. సీట్లలో మెలకువగా ఉన్నవారు లేదా ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక, అప్పర్‌ బెర్త్‌ల్లో ఉన్నవారు బయటపడటం చాలా క్లిష్టంగా ఉంటోందని అంటున్నారు.
 
స్లీపర్ బస్సులో దిండ్లు, పరుపులు, దుప్పట్లు, కర్టెన్లకు మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మంటలు చెలరేగిన కొద్ది క్షణాల్లోనే ఇవి బస్సు అంతా వ్యాపిస్తాయి. బస్సులో కిటికీలు ఉండవు. ఎయిర్ కండిషన్డ్ డిజైన్ వల్ల పొగ మొత్తం కంపార్ట్‌మెంట్‌లోకి వేగంగా నిండుతుంది. దీంతో కొద్ది సమయంలో మంటల్లో చిక్కుకుని ప్రయాణికులకు గాయాలు అవుతాయి. 
 
ఇక నిద్రలో ఉన్న వాళ్లు ఆ పొగ పీల్చడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. కాలిన గాయాలు కూడా మరణాల సంఖ్యను పెంచుతున్నాయి.  ఈ స్లీపర్‌ బస్సులు తొలుత పశ్చిమదేశాల్లో నడిపేవారు. సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని వినియోగించేవారు. ఆ తర్వాత సాధారణ ప్రజా రవాణాలో ఇవి భాగమయ్యాయి. అయితే, వీటిల్లో జరుగుతోన్న ప్రమాదాల కారణంగా కొన్ని దేశాలు స్లీపర్‌ బస్సుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి.