సరిహద్దులో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా

సరిహద్దులో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా

భారతదేశ సరిహద్దు దగ్గర కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని చైనా నిర్మిస్తున్నది. 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతానికి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఈ నిర్మాణాలు ఉన్నాయి. క్షిపణి ప్రయోగ స్థానాలు, విస్తృతమైన మౌలిక సదుపాయాల కారణంగా ఈ అధునాతన కాంప్లెక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఈ విషయం నిర్ధారణ అయ్యింది. టిబెట్‌లోని పాంగోంగ్ సరస్సు తూర్పు భాగం ఒడ్డున కొత్తగా వైమానిక రక్షణ స్థావరాన్ని చైనా నిర్మిస్తున్నది. 

కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యారక్‌లు, రక్షణ వాహనాల కోసం షెడ్‌లు, మందుగుండు సామగ్రి నిల్వ ప్రాంతాలు, రాడార్ స్థావరాలతో ఇది కూడి ఉన్నది.  కాగా, వైమానిక రక్షణలో భాగంగా క్షిపణులు ప్రయోగించే ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ (టీఈఎల్‌) వాహనాల కోసం ముడుచుకునే పైకప్పులతో బంకర్లను చైనా నిర్మిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ కాంప్లెక్స్లో చైనా దీర్ఘశ్రేణి హెచ్క్యూ-9 సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి (ఎస్ఏఎం) వ్యవస్థలను దాచే అవకాశం ఉందని నిఘా విశ్లేషకులు భావిస్తున్నారు. 

పాంగాంగ్ సరస్సు సమీపంలో నిర్మాణం కొనసాగుతున్నందున ఈ కాంప్లెక్స్ ప్రాంతీయ వైమానిక రక్షణ సామర్థ్యాలలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు.  మరోవైపు భారత సరిహద్దులో చైనా నిర్మిస్తున్న కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని అమెరికాకు చెందిన జియో ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్‌సోర్స్ అనాలిసిస్ పరిశోధకులు తొలుత గుర్తించారు.  అలాగే గార్ కౌంటీ వద్ద ఉన్న మరో కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా పసిగట్టారు. ఎల్‌ఏసీకి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నది. 

భారత్‌ ఇటీవల అప్‌గ్రేడ్ చేసిన న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌కు ఎదురుగా కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని చైనా నిర్మించినట్లు శాటిలైట్‌ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అలాగే మరొక అంతరిక్ష నిఘా సంస్థ అయిన వాంటర్ కూడా చైనా నిర్మిస్తున్న కాంప్లెక్స్కు చెందిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.  అందులో అనుమానిత క్షిపణి ప్రయోగశాలపై జారే పైకప్పులు కనిపిస్తున్నాయి. ఆ పైకప్పులు ఒక్కొక్కటి రెండు వాహనాలను ఉంచడానికి తగినంత పెద్దవిగా ఉన్నాయి. సెప్టెంబర్ 29న వాంటర్ విడుదల చేసిన ఛాయాగ్రహ చిత్రాల్లో కొన్ని ప్రయోగ స్థానాల్లో తెరిచిన పైకప్పులు కనిపిస్తున్నాయి. అవి క్షిపణి లాంఛర్ల ఉనికిని వెల్లడిస్తున్నాయి.