బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం

బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్ నాయకత్వంలో ఎన్​డీఏ కూటమి రాష్ట్రంలోని అన్ని ఎన్నికల రికార్డ్​ను బ్రేక్ చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిని బెయిల్​పై బయటకు వచ్చిన వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతుల్లో పట్టుకొని తిరుగుతున్న నేతలే దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 
 
వేల కోట్ల స్కామ్‌లు చేసి బెయిల్‌పై బయట తిరుగుతున్న ఆర్‌జేడీ, కాంగ్రెస్ నేతలు కూడా భారతరత్న కర్పూరీ ఠాకూర్ లాంటి మహనీయుడి బిరుదును పొందాలని తాపత్రయ పడుతున్నారని మోదీ ఎద్దేవా చేశారు. శుక్రవారం బిహార్‌లోని సమస్తీపూర్‌లోని జరిగిన ఎన్‌డీఏ కూటమి ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు హాజరైన ప్రజలను వారివారి ఫోన్లలోని టార్చ్ లైట్లను ఆన్ చేయమని కోరారు. దీంతో అందరూ ఫోన్లలోని టార్చ్ లైట్లను ఆన్ చేసి చూపించారు. 
 
ప్రజలందరి చేతుల్లోకి ఆధునిక గాడ్జెట్లు వచ్చినందున, ఇక లాంతర్లు అక్కర్లేదని మోదీ స్పష్టం చేశారు. తద్వారా ఆర్‌జేడీ పార్టీ లాంతరు గుర్తుపై సెటైర్స్ వేశారు. “2005 అక్టోబరులో జంగిల్ రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి లభించింది. నీతీశ్ కుమార్ సారథ్యంలో రాష్ట్రంలో ఎన్‌డీఏ సర్కారు ఏర్పాటైంది. ఆ సమయానికి కేంద్రంలో కాంగ్రెస్ – ఆర్‌జేడీ కూటమి పాలన ఉండేది. నాటి కేంద్ర ప్రభుత్వం నీతీశ్ కుమార్ మార్గంలో చాలా అడ్డంకులను సృష్టించింది” అని గుర్తు చేశారు. 
 
అయినప్పటికీ బలమైన సంకల్పంతో నీతీశ్ ముందుకు సాగాని, బిహారీలకు సుపరిపాలన అందించారని ప్రధాని కొనియాడారు. నీతీశ్‌ కుమార్‌కు అనుకూలంగా ఓట్లు వేశారనే అక్కసుతో, నాటి కేంద్ర సర్కారులో ఉన్న ఆర్‌జేడీ పార్టీ బిహారీలపై ప్రతీకారాన్ని తీర్చుకుందని ప్రధాని ఆరోపించారు. బిహార్‌లోని నీతీశ్ కుమార్ సర్కారుకు ఏదైనా సాయం చేస్తే, కేంద్ర సర్కారుకు మద్దతును ఉపసంహరించుకుంటాం అని చెబుతూ కాంగ్రెస్‌ను కూడా ఆర్‌జేడీ బ్లాక్ మెయిల్ చేసిందని ప్రధాని మోదీ మండిపడ్డారు.
 
“మేం గత 11 ఏళ్లలో బిహార్‌కు ఆర్థిక సహాయాన్ని, బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచాం. ప్రస్తుతం రాష్ట్రంలో పండే మఖానా విదేశాలకు ఎగుమతి అవుతోంది. బిహార్‌కు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో స్టార్టప్‌లు ఏర్పాటవుతాయి” అని ప్రధాని హామీ ఇచ్చారు. 
 
ప్రభుత్వం కేటాయించే ప్రతీ రూపాయిలో 15 పైసలే పేదలకు చేరుతున్నాయని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఒకసారి చెప్పారని పేర్కొంటూ అప్పట్లో దారిమళ్లిన ప్రభుత్వ నిధులన్నీ రక్తపు పంజాలోకి వెళ్లేవని, కాంగ్రెస్, ఆర్‌జేడీ లాంటి పార్టీల పాలనలోనే అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రధాని విమర్శించారు. ఆర్‌జేడీ హయాంలోనే రాష్ట్రంలోని 18 జిల్లాల్లో మావోయిస్టులు బలపడ్డారని,  ఫలితంగా వందలాది మంది హత్యలు జరిగాయని చెప్పారు. 
 
“అప్పట్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడేవారు. మేం 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మావోయిజం వెన్ను విరిచాం. త్వరలోనే మావోయిజం నుంచి భారత్‌కు విముక్తి లభిస్తుంది. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.