ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం 2025లో అద్భుత పురోగతిని సాధించిందని ఇస్రో ఛైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 200కిపైగా కీలక మైలురాళ్లను అధిగమించామని వెల్లడించాయిరు. బెంగళూరులో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లెవ్ 2025 (ఈఎస్టిఐసి -2025) కర్టన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ. 400 కోట్లతో మూడో లాంఛ్ ప్యాడ్‌ను తమిళనాడులో నిర్మించేందుకు ఆమోదం పొందామని వెల్లడించారు.
ప్రయోగాల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. “ప్రధాని మోదీ నేతృత్వంలో జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200కి పైగా కీలక మైలురాళ్లను సాధించాం. జనవరి 6న ఆదిత్య ఎల్ 1 మిషన్ నుంచి సేకరించిన 10 టెరాబైట్ల సాంకేతిక డేటాను విడుదల చేశాం. ఆ తర్వాత ఫిబ్రవరిలోనే మరికొంత డేటాను రిలీజ్ చేశాం. ఇప్పటి వరకు ఆదిత్య మిషన్ నుంచి దాదాపు 15 టెరాబైట్ల డేటాను ప్రచురించాం” అని తెలిపారు.
“తొలిసారిగా ఆర్బిట్ డాకింగ్ ప్రయోగం స్పేడెక్స్ను జనవరి 16న చేపట్టాం. గంటకు 28,400కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేశాం. ఆల్గారిథమ్స్, కెమెరాలుతో పాటు వివిధ వ్యవస్థలను ఉపయోగించి ఈ రెండు శాటిలైట్లను విజయవంతంగా డాకింగ్ చేశాం. ఫలితంగా ప్రపంచంలోనే స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది” అని నారాయణన్ చెప్పారు.
జనవరి 29న జీఎస్ఎల్వీ- ఎఫ్ 15 మిషన్ ప్రయోగించామని, ఇది శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేసిన వందో ప్రయోగం అని గుర్తు చేశారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశకు వచ్చిందని, దాదాపు 85-90 పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వీటిపై ప్రస్తుతం అంతర్గత పరీక్షలు, సాఫ్ట్వేర్ పనితీరును పరీశీలిస్తున్నామని చెప్పారు. దీనికంటే ముందుగా మూడు మానవ రహిత మిషన్లు చేపడతామని వెల్లడించారు.
బ్లూబర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇస్రోకు అందిందని, ప్రయోగానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దీని లాంఛ్ తేదీ ప్రధాని మోదీ సరైన సమయంలో ప్రకటిస్తారని, ఈ ఏడాది చివరి నాటికి లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తు చేశారు. చంద్రయాన్ 4 మిషన్ ప్రయోగానికి సన్నాహా దశలో ఉన్నామని, దీని ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. గగన్‌యాన్, చంద్రయాన్, బ్లూబర్డ్ ప్రాజెక్టులు అంతరిక్ష, శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత ఆత్మనిర్భరతను చాటుతాయని చెప్పారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల వారు ఒకే వేదికపై కలిసేందుకు ఈఎస్టిఐసి-2025 ఎంతగానో ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. పరస్పరం ఆలోచనలు పంచుకుని కలిసి పని చేస్తూ వచ్చే రెండు దశాబ్దాలకు మన విజన్‌ను సిద్ధం చేయాలని సూచించారు. గగన్ యాన్, చంద్రయాన్ లాంటి ప్రాజెక్టులు సాధిచండం కేవలం ఇస్రో ఘనత మాత్రమే కాదని, ఇందులో భారత సాంకేతిక వ్యవస్థ ఉమ్మడి కార్యచరణ, సామర్థ్యం కనిపిస్తుందని తెలిపారు.

More Stories
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం