కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం

కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టుకుని కిందకు దూకేశారు.   డీఐజీ కోయ ప్రవీణ్‌ వివరాల ప్రకారం బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. అందులో 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు. 41 మంది ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. 
వీరిలో 10 మంది మహిళలు. ఇప్పటివరకు బస్సులో నుంచి 19 మృతదేహాలు ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. వీరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాద సమయంలో అత్యవసర ద్వారం పగలగొట్టి 12 మంది బయటపడగలిగారు. వీరిని సమీపంలోని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌ ప్రైవేటు బస్సు (నంబర్‌ DD09 N9490) అర్ధరాత్రి అనంతరం చిన్నటేకూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

 తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరిన బస్సు బెంగళూరుకు వెళ్తుండగా చిన్నటేకూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే మంటలు ఇంజిన్‌ నుంచి మొత్తం బస్సులో వ్యాపించాయి. ఇంధన ట్యాంక్‌ పేలడంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి.

ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులో ప్రధాన డ్రైవర్‌ కనిపించడం లేదని డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. మరో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, లక్ష్మయ్యలుగా గుర్తించారు.  ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు పోలీసులు, రవాణాశాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆ సమయంలో భారీ వర్షం కురుస్తోంది. మంటలు చెలరేగినప్పటికీ వర్షం కారణంగా మంటల నియంత్రణకు కొంత సవాలు ఎదురైంది. అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకున్నప్పటికీ అప్పటికే బస్సు దగ్ధమైపోయింది. రహదారిపై ఇతర వాహనాలు నిలిచిపోవడంతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్‌ పర్యటనలో ఉన్న సీఎంకు అధికారులు ఈ ఘటన వివరాలను తెలియజేశారు. వెంటనే సీఎస్‌, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహకరించాలని ఆదేశించారు.

అదేవిధంగా ఉన్నతస్థాయి యంత్రాంగం ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. బస్సు దగ్ధమైన ఘటనలో ఎక్కువ మంది మృత్యువాత పడడంపై ఎపి బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులకు సహాయ సహకారాలు అందించాలని కర్నూలు బిజెపి నేతలను ఆయన ఆదేశించారు.
 
కాగా, గతంలో కూడా తెలంగాణ పరిధిలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి భారీగా ప్రాణనష్టం జరిగింది. 2103లో జరిగి ఈ ఘటనలో 45 మంది చనిపోయారు.. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ బస్సు కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.