రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు

రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
ఉక్రెయిన్​తో యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. దీంతో లుకాయిల్‌, రోస్‌నెఫ్ట్‌పై ప్రభావం పడుతుంది. ఈ ఆంక్షలు తీవ్రమైనవి, తర్వగా యుద్ధం పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
 
 ‘ఇది ఒక ముఖ్యమైన రోజు అవుతుంది. ఇవి ఎంతో పెద్ద, ప్రభావవంతమైన ఆంక్షలు. వాటిని రష్యా రెండు ప్రముఖ చమురు కంపెనీలపై విధించాం. యుద్ధం పరిష్కారం అవుతుందని మేం ఆశిస్తున్నాం. క్షిపణులు, ఇతర ఆయుధాలపై వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చాం. కానీ వాటి అవసరం రాకూడదని భావిస్తున్నాం’ అని తెలిపారు.  `వారు చాలా కాలంగా ఏర్పాటు చేసుకున్న సరిహద్దుల వద్దే ఆగి ఇంటికి తిరిగి వెళ్లాలని మేం కోరుకుంటున్నాం.  గత వారం దాదాపు 8వేల మంది సైనికులు మరణించారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఇద్దరూ చనిపోయారు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఇది ముగియాలని మేం కోరుకుంటున్నాం’ అని స్పష్టం చేశారు. 
 
`ఈ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే ఈ యుద్ధం మొదలయ్యేది కాదు’ అని ట్రంప్ వైట్ హౌస్‌లో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఆంక్షలు విధించారు అనే అడిగిన ప్రశ్నలకు, ఇది సరైన సమయం అనిపించిదని ట్రంప్ చెప్పారు.  తాము చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. ట్రంప్ నిర్ణయాన్ని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్​ ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో శాంతి సాధనలో ట్రంప్ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమైనవి అన్నారు.

భారత్‌ నుంచి తనకు హామీ

మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం గురించి ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి భారత్​ చమురు దిగుమతులను భారీగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. తగ్గింపు క్రమంగా ఉంటుందని, ఇది మంచి చర్య అని చెప్పారు. ఈ మేరకు భారత్‌ నుంచి తనకు హామీ వచ్చిందని కూడా పునరుద్ఘాటించారు. ట్రంప్ చేస్తున్న ఈ వాఖ్యలపై భారత్‌ ఖండిస్తూనే వస్తుంది. అయినా, అగ్రరాజ్యం అధ్యక్షుడు మళ్లీ మళ్లీ ఇలాంటి ప్రకటనలే చేయడం గమనార్హం.