ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ

ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ

మలేసియాలో జరగనున్న ఆసియాన్ సదస్సుకు వర్చువల్‌గా హాజరు కానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతకుముందు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సైతం ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లు ఎక్స్‌లో వెల్లడించారు. ముందస్తు కార్యక్రమాల కారణంగా మోదీ వర్చువల్‌గా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తానని చెప్పినట్లు ఇబ్రహీం తెలిపారు.

“నిన్న రాత్రి, మలేషియా-భారతదేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింత వ్యూహాత్మక, సమగ్ర స్థాయికి బలోపేతం చేసే ప్రయత్నాలను చర్చించడానికి భారత గణతంత్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహచరులు ఒకరి నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది” అని ఆయన తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడి రంగాలలో, సాంకేతికత, విద్య, ప్రాంతీయ భద్రతలో సహకారంతో పాటు, భారతదేశం మలేషియాకు ముఖ్యమైన భాగస్వామిగా కొనసాగుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 
“ఈ నెలాఖరులో కౌలాలంపూర్‌లో జరిగే 47వ ఆసియాన్ సమ్మిట్ నిర్వహణ గురించి కూడా మేము చర్చించాము. ఆ సమయంలో భారతదేశంలో దీపావళి వేడుకలు జరుగుతున్నందున తాను వర్చువల్‌గా హాజరవుతానని ఆయన నాకు తెలియజేశారు,” అని అన్వర్ పేర్కొన్నారు. ఈ పండుగకు మోదీకి, భారత ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు. మలేషియా-భారతదేశం సంబంధాలను పెంపొందించడానికి,  “మరింత శాంతియుత, సంపన్న ప్రాంతం వైపు” ఆసియాన్-భారతదేశం సహకారాన్ని బలోపేతం చేయడానికి తన దేశం నిబద్ధతను మలేషియా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఈ నెల 26 నుంచి 28 వరకూ ఆసియాన్ సదస్సు జరగనుంది.  ఈ సదస్సు నేపథ్యంలో మలేషియాతోపాటూ కంబోడియాలో కూడా ప్రధాని పర్యటించాలని తొలుత భావించారు. అయితే, తాజాగా ఆయన ఈ సదస్సుకు వెళ్లకపోవడంత కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా అనేక దేశాల నాయకులు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ గైర్హాజరు నేపథ్యంలో ట్రంప్‌ – మోదీ భేటీ ఈసారి కూడా లేనట్లే. 

ఈ ఆసియాన్‌లో మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, మయన్మార్‌ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్‌ ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.