మెహుల్‌ చోక్సీ అప్పగింతలో అడ్డంకులు లేవన్న బెల్జియం కోర్టు

మెహుల్‌ చోక్సీ అప్పగింతలో అడ్డంకులు లేవన్న బెల్జియం కోర్టు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీని భారత్‌ను తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. చోక్సీని భారత్‌కు అప్పగించే విషయంలో భారత్‌, బెల్జియన్‌ చట్టాల ప్రకారం చోక్సీని భారత్‌కు అప్పగించడంలో ఎలాంటి అడ్డంకులు లేవని బెల్జియం కోర్టు బుధవారం స్పష్టం చేసింది.  బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లోని ఒక కోర్టు తన తీర్పులో చోక్సీ నేరాలు భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్షార్హమైనవని తెలిపింది. చోక్సీపై మోసం, దుర్వినియోగం, ఫోర్జరీ అభియోగాలు బెల్జియన్ చట్టం ప్రకారం కూడా శిక్షార్హమైనవని కోర్టు స్పష్టం చేసింది.

పైగా, చోక్సి బెల్జియం పౌరుడు కాదని గుర్తుచేసింది. నేరాలు 2016 డిసెంబర్ 31 నుండి జనవరి 2019 మధ్య భారత్‌లో జరిగాయని.. బెల్జియన్ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్ కాలపరిమితికి లోబడి ఉండదని తీర్పు స్పష్టం చేసింది. అయితే, భారత్‌ ఆదేశాలకు తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్‌ చేశారంటూ చోక్సీ చేసిన వాదలను కోర్టు తోసిపుచ్చింది. ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటూ కొట్టిపడేసింది. 

చోక్సీ అప్పగింత అనంతరం అతడిని ఉంచే జైలుకు సంబంధించి భారత ప్రభుత్వం అందించిన వివరాలను ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న దాదాపు రూ.13 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన చోక్సీ, మేనల్లుడు నీరవ్‌ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా బార్బుడాకు పారిపోగా, నీరవ్‌మోదీ లండన్‌లో ఉంటున్నాడు. 

ఇటీవల అంట్వర్ప్‌లోని కోర్టు చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. భారత్‌కు చోక్సీని అప్పగిస్తే ఆయనను ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులోని బ్యారక్‌ నెంబర్‌ 12లో ఉంచుతామని అధికారులు కోర్టుకు హామీ ఇచ్చారు. బ్యారక్ దాదాపు 46 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని, రెండు సెల్‌లు, ప్రైవేట్ టాయిలెట్ సౌకర్యాలు ఉన్నాయని, వైద్య సహాయం ఉంటుందని అధికారులు తెలిపారు. 

అయితే, తాను అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నానని, సరైన చికిత్స అందదని చోక్సీ చేసిన వాదనలు కోర్టు తోసిపుచ్చింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను రూ.13వేలకోట్లకుపైగా మోసం చేసి చోక్సీ, నీరవ్‌ మోదీ దేశం విడిచి పరారయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనను భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్‌ విజ్ఞప్తి మేరకు బెల్జియం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

ఆ తర్వాత భారత్‌ ఆంట్వెర్ప్‌ కోర్టులో భారత్‌కు అప్పగించాలని పిటిషన్‌ వేసింది. ఆ తర్వాత చోక్సీ పలుసార్లు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ గతంలో చోక్సీ నిర్బంధం, ఆరోగ్య సంరక్షణ విషయంలో బెల్జియంకు పలు హామీలు ఇచ్చింది.