దీపావళి రోజున రూ.6.05లక్షల కోట్ల అమ్మకాలు

దీపావళి రోజున రూ.6.05లక్షల కోట్ల అమ్మకాలు
* దేశ చరిత్రలో తొలిసారి భారీ అమ్మకాలు
ఈ ఏడాది దేశవ్యాప్తంగా దీపావళి అమ్మకాలు రూ.6.05లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.5.40 కోట్ల విలువైన వస్తువుల వ్యాపారం.. రూ.65వేల కోట్ల విలువైన సర్వీసెస్‌ వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సిఏఐటి) నివేదికను విడుదల చేసింది. ఇదే ఇప్పటి వరకు దేశ వాణిజ్య చరిత్రలో అతిపెద్ద పండుగగా నిలిచింది. 
 
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు టైర్‌-2, టైర్‌-3 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 60 ప్రధాన కేంద్రాల్లో సీఏఐటీ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ నిర్వహించిన సర్వే ఆధారంగా ‘డిటైర్డ్‌ దీపావళి పండుగ అమ్మకాలు 2025’ పేరుతో నివేదికను విడుదల చేసింది. సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు, స్వదేశీ స్వీకరణకు బలమైన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎదిగారని నివేదిక చూపిస్తుందని పేర్కొంది.

ఇది వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరిని అపూర్వమైన రీతిలో ప్రేరేపించిందని తెలిపారు. 87 శాతం మంది వినియోగదారులు విదేశీ వస్తువుల కంటే భారతీయ వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారని, తత్ఫలితంగా చైనా ఉత్పత్తులకు డిమాండ్‌ భారీగా తగ్గిందని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే భారత్‌లో తయారైన అమ్మకాలు 25శాతం పెరిగాయని వ్యాపారులు తెలిపారు. 

దీపావళి సందర్భంగా అమ్మకాల్లో కిరాణా, ఎఫ్‌ఎంసీజీ 12శాతం, బంగారం-వెండి 10శాతం, ఎలక్ట్రానిక్స్‌ 8శాతం, కన్య్సూమర్‌ డ్యూరబుల్‌ 7శాతం, రెడీమేడ్‌ దుస్తులు 7శాతం, గిఫ్ట్‌ ఐటమ్స్‌ 7శాతం, హోమ్‌ డేకర్‌ 5శాతం, ఫర్నిషింగ్-ఫర్నీచర్ 5శాతం, స్వీట్లు-స్నాక్స్ 5శాతం, వస్త్రాలు 4శాతం, పూజ వస్తువులు 3శాతం, పండ్లు- గింజలు 3శాతం, బేకరీ-మిఠాయిలు 3శాతం, పాదరక్షలు 2శాతం, ఇతర వస్తువులు 19శాతం అమ్మకాలు జరిగాయని క్యాట్‌ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ వెల్లడించారు. 

సేవల రంగం సైతం గణనీయమైన వృద్ధిని సాధించిందని.. రూ.65వేల కోట్ల వాణిజ్యాన్ని సృష్టించిందని తెలిపారు. ప్యాకేజింగ్, హాస్పిటాలిటీ, టాక్సీ సేవలు, జర్నీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్, టెంట్లు-అలంకరణలు, మానవశక్తి-డెలివరీ వంటి రంగాలలో కూడా అపూర్వమైన కార్యకలాపాలు జరిగాయని, పండుగ ఆర్థిక వ్యవస్థ పరిధిని విస్తరించిందని పేర్కొన్నారు. 

సర్వేలో పాల్గొన్న వ్యాపారుల్లో 72 శాతం మంది తమ అమ్మకాలు పెరగడానికి జీఎస్టీ రేట్ల తగ్గింపే కారణమని చెప్పారు. ధరలు స్థిరంగా ఉండడంపై వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. వ్యాపారులు, వినియోగదారుల వినియోగదారుల సెంటిమెంట్ దశాబ్దంలోనే ఈ సారి అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది.

ట్రేడర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ (టిసిఐ) 8.6/10, కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ (సిసిఐ) 8.4/10గా ఉన్నది. ఈ ఉత్సాహభరితమైన సెంటిమెంట్ శీతాకాలం, వివాహాల సీజన్, జనవరి మధ్యలో ప్రారంభమయ్యే రాబోయే పండుగ సీజన్ అంతటా కొనసాగుతుందని నివేదిక పేర్కొంది. దీపావళి-2025 బిజినెస్‌ ఐదు మిలియన్ల తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించిందని నివేదిక తెలిపింది.