లెఫ్టినంట్ క‌ల్న‌ల్‌గా నీర‌జ్ చోప్రా

లెఫ్టినంట్ క‌ల్న‌ల్‌గా నీర‌జ్ చోప్రా

భార‌త మేటి జావెలిన్ త్రోయ‌ర్‌, ఒలింపిక్ ప‌త‌క విజేత నీర‌జ్ చోప్రాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. జావెలిన్ సూప‌ర్ స్టార్ నీర‌జ్ చోప్రాకు భార‌తీయ ఆర్మీలో గౌర‌వ‌ప్ర‌ద‌మైన లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ర్యాంక్‌ను అంద‌జేశారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఆయ‌న్ను ఆ ర్యాంక్‌తో స‌న్మానించారు.  ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

నీర‌జ్ చోప్రా కుటుంబం కూడా ఈ ఈవెంట్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించింది. పట్టుద‌ల‌కు, దేశ‌భ‌క్తికి నీర‌జ్ చోప్రా నిద‌ర్శ‌న‌మ‌ని రాజ్‌నాథ్ కొనియాడారు. ప్ర‌భుత్వ గెజిట్ ప్ర‌కారం నీర‌జ్ చోప్రా నియామ‌కం ఏప్రిల్ 16వ తేదీన జ‌రిగింది.  జూనియ‌ర్ క‌మీష‌న్డ్ ఆఫీస‌ర్‌గా న‌యిబ్ సుబేదార్‌ ర్యాంకుతో నీర‌జ్ చోప్రా 2016 ఆగ‌స్టులో భార‌తీయ సైన్యంలో చేరారు. నీర‌జ్ చోప్రాకు గ‌తంలో ప‌ద్మ‌శ్రీ, మేజ‌ర్ ధ్యాన్ చంద్ ఖేల్ ర‌త్న, అర్జున అవార్డులు ద‌క్కాయి. ప‌ర‌మ విశిష్ట సేవా మెడ‌ల్‌, విశిష్ట సేవా మెడ‌ల్ కూడా ఆయ‌న గెలుచుకున్నారు.

2020లో టోక్యోలో జ‌రిగిన ఒలింపిక్స్ క్రీడ‌ల్లో జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా స్వ‌ర్ణ ప‌త‌కం గెలుచుకుని చ‌రిత్ర సృష్టించారు. ఆ త‌ర్వాత 2024 పారిస్ ఒలింపిక్ క్రీడ‌ల్లో ర‌జ‌త ప‌త‌కం సాధించాడు. 2023 వ‌ర‌ల్డ్ అథ్లటిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ కొట్టాడు. ఏషియ‌న్, కామ‌న్‌వెల్త్ గేమ్స్‌తో పాటు డైమండ్ లీగ్‌ల్లోనూ అత‌ను స్వ‌ర్ణ ప‌త‌కాలు గెలుచుకున్నాడు. నీర‌జ్ చోప్రా త‌న జావెలిన్‌ను అత్యుత్త‌మంగా 90.23 మీట‌ర్ల దూరం విసిరి రికార్డు సృష్టించాడు. నీర‌జ్ సాధించిన విజ‌యాల‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ కీర్తించారు. రాబోయే త‌రాల‌కు ఇన్‌స్పిరేష‌న్‌గా ఆయ‌న నిలుస్తార‌న్నారు. ప‌ట్టుద‌ల‌కు, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు నీర‌జ్ ఆద‌ర్శప్రాయుడ‌న్నారు.