లొంగుబాటుకు మావోయిస్టు అగ్రనేత హిడ్మా సిద్ధం?

లొంగుబాటుకు మావోయిస్టు అగ్రనేత  హిడ్మా సిద్ధం?

దేశ వ్యతిరేక కార్యకలాపాలతో దశాబ్దాలుగా భద్రతా వ్యవస్థకు సవాల్‌గా నిలుస్తున్న మావోయిస్టు ఉద్యమంలో కీలక మలుపు రానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్జియే)–1 కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగుచూసింది. 

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన ఈ మావోయిస్టు నాయకుడు, సుమారు 200 మంది మావోయిస్టు సభ్యులతో కలిసి లొంగుబాటు  అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నాడనే ప్రచారం కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు కట్టుదిట్టమైన ఆపరేషన్లు చేపట్టడం, నాయకత్వం మార్పులు, అంతర్గత విభేదాలు వంటి అంశాల ప్రభావంతో హిడ్మా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. సుక్మా అడవుల్లోని మావో స్కూళ్లో శిక్షణ పొందిన ఆయన, క్రమంగా ఆర్గనైజేషన్‌లో ప్రాధాన్యత పొందాడు. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర మావోయిస్టు నేతలతో కలిసి పనిచేసి అనేక దాడులకు వ్యూహరచన చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.  2010లో దంతేవాడ అంబుష్, 2013లో జిరంఘాటీ దాడి, 2021లో సుక్మా-బీజాపూర్ ఎన్‌కౌంటర్ వంటి అనేక దాడుల వెనుక హిడ్మా కీలక పాత్ర వహించినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. మావోయిస్టు సైనిక విభాగంలో వ్యూహాత్మక ఆలోచనల్లో దిట్టగా ఉండే ఆయన, గిరిజన ప్రాంతాల్లో తన నెట్‌వర్క్‌ను బలపరచాడు.

హిడ్మా లొంగిపోతే అది మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ అవుతుందని భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్ర హోం శాఖ వర్గాల ప్రకారం, హిడ్మా లొంగిపోతే “అడవుల్లోని మావోయిస్టు పోరాటం దాదాపు అంతం అవుతుంది” అనే భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భద్రతా బలగాలు చత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాయి. 
 
ఈ నేపథ్యంలో హిడ్మా వంటి టాప్ కమాండర్ లొంగిపోతే, మిగతా కేడర్ కూడా లొంగుబాటు వైపు మళ్లే అవకాశం ఉంది. పలువురు అగ్రనేతలు కాల్పులలో చనిపోవడమో, లొంగిపోవడమో జరిగిన తర్వాత మిగిలిన వారిలో  హిడ్మా ను కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నారు. అతని కోసం కొంతకాలంగా ప్రత్యేకంగా జల్లెడ పడుతున్నారు. పలు పర్యాయాలు చిక్కిన్నట్లే చిక్కి తప్పించుకున్నాడు. తాను లొంగిపోతే మావోయిస్టు సమస్యకు శాంతియుత పరిష్కారం దిశగా ఒక చారిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు.