శబరిమల బంగారం కేసులో కుట్ర?.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం

శబరిమల బంగారం కేసులో కుట్ర?.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం

శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువులో వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్‌ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసులో వేగవంతమైన, కచ్చితమైన దర్యాప్తు జరగాలని సిట్ను జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌ వి, జస్టిస్‌ కేవీ జయకుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

మంగళవారం ఈ కేసును సంబంధించిన సిట్ తన తాత్కాలిక నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. మరోవైపు దర్యాప్తు గోప్యతను కాపాడేందుకు హైకోర్టు సుమోటోగా కొత్త పిటిషన్‌ను నమోదు చేయాలని నిర్ణయించింది. దీనిలో ప్రస్తుత పిటిషన్‌లోని ఉన్నికృష్ణన్ పొట్టి, స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ మినహాయించాలని, బదులుగా ప్రభుత్వాన్ని, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు, పోలీసులను చేర్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 

బంగారం దొంగతనం జరిగిన సమయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు, కమిషనర్ తీసుకున్న చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. దేవస్థానం బోర్డు అధ్యక్షుడు, ఉన్నికృష్ణన్ పొట్టికు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని తేలికగా తీసుకోలేమని తెలిపింది. దేవస్థానం మాన్యువల్ ఉల్లంఘనలపై కూడా తీవ్ర అనుమానాలు ఉన్నాయని చెప్పింది.

ఈ క్రమంలో గత రెండు సంవత్సరాల్లో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, కుట్రలను పూర్తిగా పరిశీలించాలని సిట్ను ధర్మాసనం ఆదేశించింది. సుమారు 500 గ్రాముల బంగారం ఎక్కడికి వెళ్లిందో దేవస్థానం అధికారులకే తెలిసి ఉండవచ్చని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. 

ఉన్నికృష్ణన్ పొట్టి ఉద్దేశాలు సరైనవి కాదని, అన్ని సంబంధిత పత్రాలు పరిశీలించి తుది నివేదిక సమర్పించాలని సిట్కు సూచించింది. ఈ కేసు కేవలం కేరళ పోలీసుల ప్రతిష్ఠకే కాకుండా, హైకోర్టు నమ్మకానికీ సంబంధించినదని బెంచ్ పేర్కొంది. కేసు విచారణ వచ్చే నెలలో మళ్లీ జరుగుతుంది.

ప్రస్తుతం శబరిమల దేవాలయంలో విలువైన వస్తువుల లెక్కింపును రిటైర్డ్ జడ్జి జస్టిస్ కేటీ శంకరన్ నేతృత్వంలో కొనసాగుతోంది. విజిలెన్స్‌ కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగానే హైకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, బెంగళూరులోని ఉన్నికృష్ణన్ పొట్టి స్నేహితుడు అనంత సుబ్రహ్మణ్యన్ను సోమవారం కేరళకు తీసుకొచ్చి సిట్ ప్రశ్నించింది. విజిలెన్స్ నివేదికలో కూడా సుబ్రహ్మణ్యన్ పేరు ఉంది.

ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించిన పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది.  ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.