హిందువులపై కుట్రలను కాంగ్రెస్ ఇప్పటికైనా ఆపాలి !

హిందువులపై కుట్రలను కాంగ్రెస్ ఇప్పటికైనా ఆపాలి !

ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి,
బీజేపీ జాతీయ కౌన్సిల్ కమిటీ సభ్యులు
 
“కాంగ్రెస్‌లో ఉండాలంటే   మీరు హిందూ మతాన్ని అవమానించాలి. లేకపోతే ఆ పార్టీలో ఉండలేరు. మీరు ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని బలహీనపరిస్తేనే ఆ పార్టీలో బలంగా ఉంటారు. లేకపోతే ప్రోత్సహించరు ”  ప్రఖ్యాత శాస్త్రవేత్త, రచయిత ఆనంద్ రంగనాథన్ చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు. 
 

దానికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిలా రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్మించాలని నిర్ణయించుకున్న ఆలయాల విషయంలో బహిరంగ వ్యతిరేకత చూపడం.  ఆలయాలను నిర్మించాల్సిన పని లేదని, ఆ నిధులతో టాయిలెట్లు నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు.  భక్తులు ధర్మప్రచారం కోసం శ్రీవారికి సమర్పించే కానుకలతో దళితవాడల్లో ఆలయాలను నిర్మించి వారిని దేవుడికి మరింత దగ్గర చేయకూడదనే కాంగ్రెస్ ప్రణాళికల్ని షర్మిల ద్వారా గాంధీ కుటుంబం అమలు చేస్తోందని సులువుగా అర్థం చేసుకోవచ్చు.  కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నాయకులకే ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి నాయకులనే ప్రోత్సహిస్తారు. ఇదంతా పై స్థాయి అజెండా.

కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తే హిందూత్వాన్ని గౌరవించినట్లుగా కానీ, హిందువులను ప్రథమ పౌరులుగా చూసినట్లుగా కానీ ఆధారాలు లేవు. కానీ హిందూత్వాన్ని కించపర్చడానికి ఆ పార్టీ చేయని ప్రయత్నాలు లేవు.  హిందూ సాంస్కృతిక, మతపరమైన హక్కులను నిర్లక్ష్యం చేయడం, ముస్లిం సమాజానికి ప్రత్యేక సౌలభ్యాలు ఇవ్వడం వంటివి లెక్కలేనన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది.

ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని దేశ విభజనకు కారణం అయిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కూడా హిందువుల హక్కులను కాల రాసేందుకు నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేకంగా చట్టాలను హిందువులకు పరిమితం చేస్తి, ముస్లింలకు  పర్సనల్ లా  ను అలాగే ఉంచింది. వక్ఫ్ బోర్డులకు ప్రత్యేక  అధికారులు ఇచ్చింది.  అలాగే, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ , జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ  మైనారిటీ స్థితి ఇచ్చి హిందూ గురుకులాలు, వేదికా పాఠశాలలకు ఆర్థిక సహాయం ఇవ్వలేదు.

ఇది హిందూ సమాజంపై మొదట్లోనే చూపించిన వివక్ష. అక్కడి నుంచి ఆ వివక్ష, కుట్రల రూపంలో బయట పడుతూనే ఉంది. మహాత్మా  గాంధీజీ హత్యకు   రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను బాధ్యులని చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం  నిషేధం విధించింది.   హిందువుల కోసం, హిందూత్వం కోసం పోరాడటమే ఆరెస్సెస్ చేసిన తప్పు.  ఆరెస్సెస్‌ను బలహీనం చేస్తే హిందువులను బలహీనం చేయవచ్చన్న కుట్రతోనే సంబంధం లేకపోయినా మహాత్ముడి  హత్యకు లింక్ పెట్టి నిషేధం విధించారు.  తప్పని పరిస్థితుల్లో 1949లో నిషేధం ఎత్తివేయాల్సి వచ్చినా కుట్రలు మాత్రం అలా సాగుతూనే వచ్చాయి.

హిందూ ఆలయాలను అభివృద్ధి చేసే విషయంలో కాంగ్రెస్ దశాబ్దాల నిర్లక్ష్యం, వ్యతరికేత చూపించింది.  1949- 50లో గుజరాత్‌లో  సోమనాథ ఆలయ పునర్నిర్మాణంపై నెహ్రూ వ్యతిరేకత వ్యక్తం చేశారు   సోమనాథ ఆలయంను పునర్నిర్మించాలని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రతిపాదించగా, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు నిరాకరించారు.

 
ఇది హిందూ మతపరమైన హక్కులను, ఆలయ పునరుద్ధరణ  నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోంది. దీనికి వారు పెట్టుకున్న పేరు  సెక్యులరిజం. ఈ సెక్యులరిజం పేరుతో ఇతర వర్గాలకు కావాల్సినంత నిధులు ఇస్తూ    హిందువులకు  సంస్కృతిని దూరం చేయడానికి ప్రయత్నించారు. 1950లో  భారత రాజ్యాంగంలో ముస్లిం ప్రత్యేక సౌలభ్యాలు కల్పించారు.   రాజ్యాంగ రచనలో ముస్లిం లీగ్ సభ్యుల పాల్గొన్నారు.  హజ్ సబ్సిడీ, మదరసాలకు ఆర్థిక సహాయం వంటి ప్రత్యేక నిబంధనలు చేర్చారు. 
 
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువుల హక్కులు (పౌరసత్వం), ఆస్తులుపై దృష్టి పెట్టకపోవడం వారి హిందూ వ్యతిరేకతను బయట పెట్టింది. అలాగే, ఆర్టికల్ 25 (మత మార్పిడి ), ఆర్టికల్ 28 (హిందులకు మత విద్య నిషేధం, ముస్లింలకు అనుమతి) వంటివి హిందూ విద్యా సంస్థలను బలహీనపరిచాయి. హిందూ సమాజానికి తీరని నష్టం చేశాయి.  అలాగే చరిత్ర పాఠ్యపుస్తకాల్లో మొఘల్ గొప్పతనం గురించి చెప్పగా హిందూ చరిత్రను నిర్లక్ష్యం చేశారు. లిటిక్స్ కింద చరిత్ర పాఠ్యపుస్తకాల్లో మొఘల్ చక్రవర్తులు  టిప్పు సుల్తాన్, ఔరంగజేబ్ లను గొప్పలుగా చూపించారు. హిందూ గ్రంథాలు, సంస్కృతి, హెరిటేజ్‌ను పాఠ్యంశాల నుంచి తొలగించారు. ఆ విధంగా హిందూ గొప్పతనాన్ని భావితరాలకు తెలియకుండా చేశారు.

 1966లో  ఢిల్లీలో గోమాంస నిషేధ డిమాండ్ చేసిన హిందూ సాధువులపై కాల్పులు జరిపారు.    రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ (గోవు హత్య నిషేధం) ప్రకారం గోమాంస నిషేధం డిమాండ్ చేసిన హిందూ సాధువులపై ఇందిరా గాంధీ ప్రభుత్వం పోలీసులు  కాల్పులు జరిపారు. వందలాది మంది హిందువుల మరణాలకు కారణమైంది. ఇది హిందూ మత విశ్వాసాలను (గోవు పవిత్రత) దెబ్బతీసేలా చేసి, ముస్లింల ఆహారపు అలవాట్లను రక్షించడానికి చేసిన ప్రయత్నమని దేశమంతటిటికి తెలుసు. అప్పట్లో కాంగ్రెస్ చేసిన ఈ పనుల వల్ల హిందూ సమాజం ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటుంది.

అసలు లౌకికత్వం అంటే హిందూవ్యతిరేకత అన్న భావన తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ.  హిందూత్వాన్ని వ్యతిరేకించడం, ఇతర వర్గాలకు ప్రోత్సహించడమే లౌకికత్వం అన్న భావన ప్రజల్లో కలిగేలా కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ.   ఇప్పటికీ హిందూవులు చాలా మంది హిందూత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటారు.  దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం  స్వాతంత్రం వచ్చిన మొదట్లో చేసిన బ్రెయిన్ వాషే కారణం. కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఊరికే చేయలేదు. రాజకీయ పరంగా కుట్రలు చేయడానికి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఇదంతా చేసింది. ఆ పార్టీ సుదీర్ఘంగా దేశాన్ని పరిపాలించడానికి కారణం ఇదే.

 
అట్టడుగు వర్గాల పేరుతో  హిందూయేతరలకు దేశ సంపదను దోచి పెట్టింది. పోనీ వాళ్లను అయినా ప్రోత్సహించి అభివృద్ధి చేసిందా అంటే అదీ కూడా లేదు. వారి పరిస్థితి దేశంలో ఇప్పటికీ అత్యంత దుర్భరంగా ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే.  అందరూ సమానమేనని ఆరెస్సెస్ సహా అందరూ చెబుతారు. దానికి తగ్గట్లుగానే విధానాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో  తమ ఓటు బ్యాంక్ మరింత ఎక్కువ సమానం.  
 
కానీ వారు అభివృద్ధి చెందితే తమకు ఎక్కడ ఓట్లు వేయరో అన్న భయంతో వారినీ అభివృద్ధి చేయలేదు. వారిని కష్టాల్లో ముంచి వారికి రేషన్ బియ్యం అందేలా చేసి  తాము కడుపు నింపుతున్న భావన కల్పించి..  తమ రాజకీయ లాభం చూసుకుంది. దేశానికి దేశ ప్రజలకు తీవ్ర నష్టం చేసింది. అయోధ్య సమస్యను రాజకీయం చేసి సుదీర్ఘకాలం కొనసాగేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాజకీయం లాభం పొందాలంటే హందూ, ముస్లింల మధ్య వివాదాలు అలాగే ఉండాలంటే ఆ సమస్య అలా రగులుతూనే ఉండాలని కోరుకుంది. అందుకే  తాను అధికారంలో ఉన్నంత కాలం సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదు.  

చివరికి భారతీయ జనతా పార్టీ ఆ సమస్యను పరిష్కరించి అందరికీ న్యాయం చేసింది.  కశ్మీర్ లో ఆర్టికల్ 370 విషయంలోనూ అదే ఫార్ములా పాటించింది. కానీ భారతీయ జనతా పార్టీ ఆ సమస్యనూ పరిష్కరించింది.  సమాజంలో ఇలా వర్గాలు, మతాల మధ్య పెట్టిన చిచ్చులను భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పరిష్కరించి దేశంలో అలాంటి రాజకీయాలకు చెక్ పెడుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీరాను రాను చిక్కిపోతోంది.  అందుకే కొత్తగా  మళ్లీ కుట్రలు ప్రారంభిస్తోంది.

మణిపూర్ సమస్యను క్రిస్టియన్ల సమస్యగా మార్చేందుకు ప్రయత్నం చేసిన విషయాన్ని ప్రజలు పట్టించుకోలేదు.  దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన సమస్యలు దేశాన్ని చుట్టుముడుతూంటే ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం అత్యంత సమర్థంగా పరిష్కరించుకుంటూ వస్తోంది.  దీని వల్ల తమ రాజకీయ భవిష్యత్ అంథకారంలోకి పోతోందని కొత్తకొత్తగాఎక్కడెక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తూనే ఉంది.

 
అందుకే ప్రపంచవ్యాప్తంగా హిందువుల దేవదేవుడు అయిన శ్రీ వేంకటేశ్వరుని మీద దృష్టి పెట్టారు.  ఆలయాల నిర్మాణాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు.   శ్రీవారికి భక్తులు కానుకలుగా సమర్పించే సొమ్ము పూర్తిగా ధర్మప్రచారానికే వినియోగించాలన్నది శాసనం. శ్రీవారి నిధులు ఆలయ నిర్వహణ, భక్తుల సంక్షేమం,  హిందూ ధర్మ ప్రచారం కోసమే వాడాలి. టీటీడీ  రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పటికీ   ఆదాయం ఆలయ, ధర్మ ప్రచార సంబంధిత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలి.   
 
శ్రీవారి ధర్మ ప్రచారాన్ని వాడ వాడలా తీసుకెళ్లేందుకు ఆలయాలు నిర్మించడం అనేది ఓ ఆధ్యాత్మిక పుణ్య కార్యక్రమం. కొన్ని వేల దళిత వాడల నుంచి ఆలయాలను నిర్మించాలనే ప్రతిపాదనలు వచ్చాయి.  దీర్ఘ కాలంగా హిందువులు.. దళితుల్ని ఆలయంలోకి అనుమతించడం లేదన్న ప్రచారం చేసి ఎక్కువగా మత మార్పిళ్లు చేశారు. కానీ ఇప్పుడు ఆలయాలను నిర్మిస్తారంటే అడ్డుకుంటున్నారంటే  కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు.  
 
ఆలయాల నిర్మాణాన్ని వ్యతిరేకించిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు స్వయంగా క్రైస్తవ మత ప్రచారానికి అంకితమైన కుటుంబానికి చెందినవారు. ఆమె భర్త అనిల్ కుమార్ పెద్ద మత ప్రచార సంస్థ నడుపుతున్నారు. వారి కుమారుడు రాజారెడ్డి కూడా అమెరికాలో బైబిల్ యూనివర్శిటీలో చదువుకున్నారు. ఇప్పుడు పాస్టర్ గా మారారు.  షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ అట్లూరి పెళ్లి కొంత హిందూ పద్దతిలో చేసినట్లుగా వీడియోను విడుదల చేశారు.

క్రైస్తవ సమాజం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో చర్చిలో వివరణ ఇచ్చారు. ఆ వీడియోలో ఆమె తాము ప్రజల్ని మోసం చేయడానికే అలా చేశామన్నట్లుగా మాట్లాడారు. పసుపుతో హిందువులకు సంబంధం లేదన్నారు.  అలాంటి లీడర్ హిందూ ఆలయాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఏంటి అర్థం?

దేశ ప్రజలందరి ఆకాంక్ష అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు తమ విద్వేషాన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరించే  ప్లాన్లు అమలు చేస్తోందని ఈ పరిణామాల ద్వారా స్పష్టత వస్తోంది.   రాహుల్ గాంధీ ఎన్నికల సీజన్లను బట్టి శివనామస్మరణ చేస్తూంటారు. ఇక్కడ ఆయన పార్టీని రాష్ట్రాల్లో నాయకత్వం వహిస్తున్న వారు మాత్రం హిందువులు, ఆలయాలపై తమ ద్వేషాన్నంతా వెళ్లగక్కుతూ ఉంటారు.  అలాంటి వారికే కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహం ఇస్తుందని మనం ముందుగానే చెప్పుకున్నాం.

 
కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రజలకు చైతన్యం వచ్చింది. లౌకికత్వం అంటే హిందూత్వాన్ని వ్యతిరేకించడం కాదని.. ఎవరి మతాన్ని వారు గౌరవించడం అని తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ రాసిన చరిత్రలోని నిజాలు ఎంత తక్కువగా ఉన్నాయో తెలుసుకుంటున్నారు. హిందూత్వంపై చేసిన కుట్రల గురించి అవగాహన పెంచుకుంటున్నారు. 
 
ఇలాంటి సమయంలో మళ్లీ  హిందువుల పుణ్యక్షేత్రాల మీద ఇతర వర్గాల వారి దాడులను ప్రోత్సహించి.. మళ్లీ చిచ్చు పెట్టి రాజకీయంగా బలపడాలనే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. ప్రజలు ఓ సారి మోసపోతారు. పదే పదే మోసపోరు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ..స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ హిందువులకు చేసిన మోసాలు, అన్యాయాలకు క్షమాపణ కోరాలి.