లోక్‌పాల్‌ కు ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దుమారం

లోక్‌పాల్‌ కు ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దుమారం
అవినీతిని నిర్మూలించే ఉద్దేశంతో ఏర్పాటైన లోక్‌పాల్‌ ఏడు విలాసవంతమైన బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుకు టెండర్‌ను పిలవడం విమర్శలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి  జస్టిస్ ఎ ఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని లోక్‌పాల్‌ ఈ నెల 16న జారీ చేసిన టెండర్‌లో ఏడు బిఎండబ్ల్యూ 3 సిరీస్‌ 330ఎల్‌ఐ కార్ల సరఫరా కోసం ప్రముఖ ఏజెన్సీల నుంచి ఓపెన్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
 
లాంగ్‌వీల్‌ బేస్‌, తెలుపు రంగులో ఉన్న ఎం స్పోర్ట్స్‌ మోడల్‌ కార్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం భారత లోక్‌పాల్‌లో ఛైర్మన్‌, ఆరుగురు సభ్యులున్నారు. అంటే ఒక్కొక్కరికీ ఒక్కో బిఎండబ్ల్యూ కారు కోసం ఈ టెండరు జారీ చేసినట్లయింది.  అలాగే లోక్‌పాల్‌ టెండర్‌ ప్రకారం ఎంపికైన సరఫరాదారులు లోక్‌పాల్‌ ఎంపిక చేసిన డ్రైవర్లు, నియమించిన సిబ్బందికి ఏడు రోజుల సమగ్ర ఆచరణాత్మక, సైద్ధాంతిక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలి.
వాహనాలు డెలివరీ చేసిన 15 రోజుల్లోపు ఈ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది.  అన్ని నియంత్రణలు, భద్రతా వ్యవస్థలతో పరిచయంతో పాటు ప్రతీ డ్రైవర్‌కు కనీసం 50 నుంచి 100 కీలోమీటర్ల ఆన్‌-రోడ్‌ ప్రాక్టీస్‌ను కవర్‌ చేయాల్సి ఉంటుందని కూడా లోక్‌పాల్‌ స్పష్టం చేసింది. బిడ్లు దాఖలు చేయడానికి నవంబర్‌ 6ను చివరి తేదీగా పేర్కొన్నారు. అలాగే రూ.10 లక్షల ముందస్తు డిపాజిట్‌ చేయాలి.
 
యాదృచ్ఛికంగా, భారత ప్రధాన న్యాయమూర్తికి మెర్సిడెస్ కారును కేటాయించగా, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు  బిఎండబ్ల్యూ 3 సిరీస్ కార్లను కేటాయించారు, లోక్‌పాల్ దీనికి టెండర్ జారీ చేసింది.ఈ వ్యవహారంపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ, భారతదేశపు జి20 షెర్పా అయిన అమితాబ్ కాంత్ లోక్‌పాల్ టెండర్‌ను విమర్శించారు.  బిఎండబ్ల్యూల ​​కంటే భారతదేశంలో తయారు చేసిన వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
 
“వారు ఈ టెండర్‌ను రద్దు చేసి @makeinindia ఎలక్ట్రిక్ వాహనాలకు వెళ్లాలి – మహీంద్రా ఎక్స్ ఇవి, బీఈ 6 లేదా టాటా హారియర్ ఇవి. అవి అత్యున్నత తరగతి వాహనాలు” అని పేర్కొంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఇలాంటి టెండర్‌ లోక్‌పాల్‌ను బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు సరళ్ పటేల్‌ ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఈ లోక్‌పాల్‌ గత 11 ఏళ్లలో ఒక్క కేసుపైన అయినా చర్య తీసుకున్నారా? అని ప్రశ్నించారు. లోక్‌పాల్‌ అవినీతిపై దర్యాప్తు చేయడానికి బదులుగా దుబారాకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు.