కొత్త దరఖాస్తులకు మాత్రమే హెచ్ -1 బీ ఫీజు లక్ష డాలర్లు

కొత్త దరఖాస్తులకు మాత్రమే హెచ్ -1 బీ ఫీజు లక్ష డాలర్లు

హెచ్-1బీ ఫీజు అంశంలో అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అమెరికా బయటి నుంచి వచ్చే కొత్త దరఖాస్తులకు మాత్రమే హెచ్ -1 బీ ఫీజు లక్ష డాలర్లు చెల్లించాలని యూఎస్‌ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ (యూఎస్​సీఐఎస్) స్పష్టం చేసింది. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులకు హెచ్-1బీలో సవరణలు, పొడిగింపులు లేదా స్టేటస్‌ మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో మినహాయింపు ఇస్తూ యూఎస్​సీఐఎస్ నవీకరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఈ నిర్ణయంతో అమెరికాలో ఇప్పటికే ఉంటున్న భారత విద్యార్థులకు భారీ ఉపశమనం దక్కనుంది. యూఎస్​సీఐఎస్ చేసిన ప్రకటన ప్రకారం, అమెరికాలో చదువుకొని, ఉద్యోగాల కోసం హెచ్‌-1బీ వీసా దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని యూఎస్​సీఐఎస్ స్పష్టం చేసింది.

దీనిప్రకారం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 21న హెచ్‌1బీ వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. హెచ్‌-1బీ ఫీజు చెల్లింపుల కోసం ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించినట్లు యూఎస్​సీఐఎస్ వెల్లడించింది. ఎఫ్‌-1 విద్యార్థి వీసా హోల్డర్లు హెచ్‌-1బీకి మారాలనుకునే వారితో పాటు, ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హోదాతో అమెరికాలో ఉన్నవారికి ఈ లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎల్‌-1 వీసాతో ఉన్న ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది.

 ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారత విద్యార్థులకు భారీ ఊరట దక్కనుంది. అమెరికా బయటి నుంచి వచ్చే కొత్త  హెచ్‌-1బీ దరఖాస్తులపై మాత్రమే రుసుం ఉంటుదని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పలు పరిశ్రమలు లేదా వృత్తులకు దీని నుంచి మినహాయింపు ఉంటుందా అనే విషయమై అస్పష్టత నెలకొంది.