
అతివాద నేతగా పేరున్న సనే తకాయిచి జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ మంగళవారం సనే తకాయిచిని ప్రధానిగా ఎన్నుకుంది. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దాంతో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనే తకాయిచి ఎన్నికయ్యారు.
ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువసభలో అధికార పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువసభలో కూడా మెజారిటీని కోల్పోయింది. దాంతో ఇషిబాపై ఒత్తిడి పెరిగి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 4న పార్టీలో ఎన్నిక నిర్వహించగా, మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి సనై తకాయిచి విజయం సాధించారు.
ఈ గెలుపు తనకు సంతోషం ఇవ్వడం కంటే, చాలా బాధ్యతను పెంచిందని ఈ సందర్భంగా సనై తకాయిచి పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ- జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో టకైచికి భారీ మద్దతు లభించింది. 465 ఓట్లలో 237 ఓట్లు సాధించి సనై తకాయిచి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
దాంతో జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల తకాయిచి 1993లో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎల్‌డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రిత్వ పదవితోపాటు పలు కీలక పదవుల్లో పనిచేశారు.
జపాన్ కొత్త ప్రధాని ఎన్నికైన తర్వాత లిబరల్ డెమొక్రటిక్ పార్టీ సభ్యులకు ఉద్దేశించి సనై తకాయిచి ప్రసగించారు. దేశ పునర్నిర్మాణం పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ‘నేను ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటా. ప్రతి తరాన్ని, ప్రతి వ్యక్తిని ఏకం చేస్తేనే మనం తిరిగి నిర్మించగలం. మనం కొద్దిమందమే ఉన్నాం. అందుకే గుర్రం లాగా అందరూ కష్టపడి పని చేయాలని అడుగుతున్నా. వర్క్-లైఫ్ బాలెన్స్ అనే ఆలోచనను పక్కన పెట్టి నేను పనిచేస్తా. పనిని మాత్రమే చేస్తా’ అని సనై తకాయిచి పేర్కొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన మోదీ
జపాన్ తొలి మహిళా ప్రధాని ఎన్నికైన సనై తకాయిచికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సనై తకాయిచితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల విషయంలో ఇరుదేశాల బంధాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు.
More Stories
కొత్త దరఖాస్తులకు మాత్రమే హెచ్ -1 బీ ఫీజు లక్ష డాలర్లు
నవంబర్ 1లోగా ఒప్పందం.. లేదంటే 155 శాతం సుంకాలు
ఇరాన్ అణు స్థావరాల ధ్వంసం ట్రంప్ ఊహల్లోనే!