సరిహద్దుల్లో 120 మంది సాయుధ ఉగ్రవాదులు!

సరిహద్దుల్లో 120 మంది సాయుధ ఉగ్రవాదులు!
 
జమ్మూ–కశ్మీర్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) వెంబడి పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ , లష్కరే తోయిబా వంటి గుంపులు సరిహద్దు ప్రాంతాల్లో చురుకుగా కదులుతున్నాయని భారత గూఢచార సంస్థలు గుర్తించాయి. సుమారు 120 మంది సాయుధ ఉగ్రవాదులు ఎల్‌ఓసీ వెంబడి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్టీ ఏజెన్సీల ద్వారా వచ్చిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఆర్మీ అత్యంత అప్రమత్తత ప్రకటించింది. 
 
పాక్ దళాలు తరచుగా సీజ్‌ఫైర్ ఉల్లంఘిస్తూ కాల్పులకు పాల్పడుతున్న నేపథ్యంలో, భారత సైన్యం పరిస్థితిని దగ్గరగా గమనిస్తోంది. ఆర్మీ వర్గాల ప్రకారం, ఇటీవల రెండు వారాలుగా నీలం వ్యాలీ, కేరన్ సెక్టర్, పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ హై అలర్ట్ ప్రకటించి, అదనపు బలగాలను మోహరించింది. గగనతల పర్యవేక్షణను పెంచి, డ్రోన్ల సాయంతో ప్రతి కదలికను గమనిస్తున్నట్లు సమాచారం. 
 
సరిహద్దు ప్రాంతాల్లో గ్రామస్తులకు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్మీ అధికారులు “దీపావళి సమయంలో శాంతి భద్రతను భంగపరచాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు ప్రయత్నాలు చేయవచ్చని అంచనా. అందుకే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. భారత సైన్యం, బిఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ ఇంటెలిజెన్స్ సంస్థలు సమన్వయంతో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.
 
ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద సెక్యూరిటీ బలగాలు పహారా కాస్తున్నాయి. మరోవైపు, పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు మళ్లీ కశ్మీర్ లోపల శాంతి వాతావరణాన్ని భంగం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని అధికారులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుగుతున్న వేళ, సరిహద్దు భద్రత అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా సంస్థల సమన్వయం వల్ల ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకోవచ్చని ఆర్మీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.