చైనా నేషనల్ టైమ్ సెంటర్‌ పై అమెరికా సైబర్‌ దాడి?

చైనా నేషనల్ టైమ్ సెంటర్‌ పై అమెరికా సైబర్‌ దాడి?

అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య, సాంకేతిక ఆధిపత్య పోరాటం ఇప్పుడు అత్యంత సున్నితమైన సైబర్ యుద్ధం స్థాయికి చేరింది. తమ దేశంలో అత్యంత కీలకంగా భావించే నేషనల్ టైమ్ సెంటర్‌ (జాతీయ సమయ కేంద్రం)పై అమెరికా సైబర్‌ దాడి చేసిందని చైనా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ దాడి వెనుక అమెరికన్ ప్రభుత్వం గూఢచార సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఎ) హస్తం ఉందని చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్యురిటీ మండిపడింది.

చైనా అధికారుల విమర్శల ప్రకారం ఈ సైబర్‌ దాడులు తొలిసారిగా మార్చి 2022లో ప్రారంభం అయ్యాయి. అమెరికన్లు తమ హ్యాకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి నేషనల్‌ టైమ్‌ సెంటర్‌లోని ఉద్యోగులు వాడే విదేశీ మెసేజింగ్‌ యాప్‌లలోని సాంకేతిక బలహీనతలను ఉపయోగించుకున్నారు. ఈ హ్యాకింగ్ ద్వారా ఉద్యోగుల ఫోన్లు, కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉన్న సున్నితమైన సమాచారాన్ని అమెరికన్లు తస్కరించినట్లు చైనా పేర్కొంది.

ఈ దాడులకు పాల్పడటానికి అమెరికా ఐరోపా, ఆసియా వ్యాప్తంగా ఉన్న అనేక వర్చువల్‌ సర్వర్లను వాడుకున్నట్లు చైనా ఆరోపించింది. తమ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు ఈ దాడులకు సంబంధించిన బలమైన ఆధారాలను సేకరించినట్లు డ్రాగన్‌ కంట్రీ వెల్లడించింది. ఈ హ్యాకింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడంతో పాటు తమ రక్షణ వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేసుకున్నట్లు చైనా ప్రకటించింది. కాగా ఈ తీవ్రమైన ఆరోపణలపై అమెరికా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో గల షియాన్‌ నగరంలో ఉన్న ఈ నేషనల్‌ టైమ్‌ సర్వీస్‌ సెంటర్‌ను చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నిర్వహిస్తోంది. ఈ కేంద్రం దేశానికి అత్యంత కచ్చితత్వంతో కూడిన ప్రామాణిక సమయాన్ని అందిస్తుంది. ఇది సాధారణ సమయాన్ని నిర్వహించడంతో పాటు ముఖ్యంగా రక్షణ, కమ్యూనికేషన్స్, ఆర్థిక లావాదేవీలు, విద్యుత్ సరఫరా, రవాణా మరియు మ్యాపింగ్‌ వంటి కీలకమైన జాతీయ భద్రతా రంగాలకు చాలా ముఖ్యమైనది. అందుకే ఈ సెంటర్‌పై దాడిని చైనా తమ జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తోంది.