
పెగాసస్ స్పైవేర్‌ను నిర్వహిస్తున్న ఇజ్రాయిల్ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్‌నకు అమెరికా జిల్లా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాట్సప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవద్దని కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఇంజక్షన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వాట్సాప్ యజమాని అయిన మెటాకు విజయం లభించినట్లయింది. ఎన్ఎస్ఓ గ్రూప్ 1,400 డివైస్‌లలో చొరబడి ఉల్లంఘనలకు పాల్పడిందంటూ 2019లో వాట్సప్ కేసు పెట్టింది.
ఈ ఆరోపణలను గత సంవత్సరం న్యాయమూర్తి హమిల్టన్ నిర్ధారించారు. మెటా వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం శాశ్వత ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. వాట్సప్‌కు మూడు బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. వారి గోప్యతను, భద్రతను కాపాడతామని ఎండ్- టు- ఎండ్ ఎన్క్రిప్షన్ పత్రంలో హామీ ఇచ్చారని, వినియోగదారుల ఖాతాలలోకి ఎన్ఎస్ఓ గ్రూప్ చట్టవిరుద్ధంగా చొరబడడంతో వాట్సప్‌కు పూడ్చలేని నష్టం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది.
ఇజ్రాయిల్ సంస్థ ప్రవర్తన సరిదిద్దలేని హాని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. శాశ్వత ఇంజక్షన్ ఆదేశాలు జారీ చేయాలన్న అభ్యర్థనకు అంగీకరించిన జడ్జి హమిల్టన్, గతంలో విధించిన 168 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని నాలుగు మిలియన్ డాలర్లకు తగ్గించారు. మార్క్ జూకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంస్థ వాట్సప్, ఫేస్బుక్, థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఇంజక్షన్ ఆదేశాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర వేదికలకు కూడా వర్తింపజేయాలన్న మెటా అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలకు, లా ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకే విక్రయిస్తున్నట్లు ఎన్సిఒ వాదిస్తున్నప్పటికీ, పౌరసమాజాన్ని లక్ష్యంగా చేసుకుందని పలువురు విమర్శిస్తున్నారు.
More Stories
చైనా నేషనల్ టైమ్ సెంటర్ పై అమెరికా సైబర్ దాడి?
రష్యా గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
పాక్- అఫ్ఘాన్ మధ్య తక్షణమే కాల్పుల విరమణ