
రష్యాలోని ఓరెన్‌బర్గ్ ప్రాంతాంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. కీవ్‌కు తూర్పువైపు 1,700 కిలోమీటర్ల దూరం చొచ్చుకొచ్చి మరీ ఈ దాడి చేయడం గమనార్హం. ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి దాడుల శక్తిని గణనీయంగా పెంచుకొందనడానికి ఈ దాడి ఉదాహరణగా నిలిచింది. ఈ దాడి వల్ల ప్లాంట్లలోని ఓ యూనిట్లో మంటలు చెలరేగాయి. అనంతరం వీటిని అదుపులోకి తెచ్చినట్లు ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. దాడి జరిగిన ప్రదేశం జనావాసాలకు అతి దగ్గరగా ఉందని చెప్పారు.
రష్యాలోని సుదూర ప్రాంతాల్లో కూడా ఉక్రెయిన్ దళాలు డ్రోన్ల దాడులు చేస్తున్నాయి. గత నెల దాదాపు 2,000 కిలోమీటర్ల మేరకు లోపలకు చొచ్చుకొచ్చి దాడికి తెగబడ్డ ఘటనలున్నాయి. రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది సవాలుగా మారింది. సైబీరియా, ఊరల్ పర్వతాల్లో చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొంటున్నాయి. తాజాగా సమర రీజయన్లో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
అయితే స్థానికులు మాత్రం ఇది చమురు రిఫైనరీని లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ ఈ దాడిపై గవర్నర్ మాత్రం ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిచడం లేదు. గతంలో కూడా ఉక్రెయిన్, రష్యా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడి చేసింది. దీంతో రష్యాకు చెందిన టీయూ-95, టీయూ-22 ఎం-త్రీ బాంబర్లు, ఏ-50 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయి.
ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారని ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనికాధికారి పేర్కొన్నారు. మరోసారి ఉక్రెయన్ మాస్కో పరిసరాల్లో 36 డ్రోన్లను ప్రయోగించింది. అయితే వాటిని రష్యా బలగాలు గాలిలోనే పేల్చివేశాయని అప్పట్లో మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్కు చెందిన పోర్టల్ వెల్లడించింది. నైరుతి మాస్కో ప్రాంతంలోని వార్తాసంస్థ కార్యాలయం వద్ద రెండు భారీ పేలుళ్లు, అనేక చిన్నపాటి పేలుళ్లు వినిపించాయని పేర్కొంది.
ఈ దాడి నేపథ్యంలో మాస్కోలోని వివిధ విమానాశ్రయాల్లో 200కు పైగా విమానాలు రద్దు కావడమో, ఆలస్యం కావడమో జరిగింది. మరోవంక, ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతమైన దొనెట్స్క్ను 11ఏళ్లుగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న రష్యా తాజాగా దీనిని తమకు అప్పగించి తీరాల్సిందేనని పట్టుబడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య గత వారం జరిగిన సుదీర్ఘ ఫోన్‌కాల్ సంభాషణలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు వైట్‌హౌజ్ అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.
More Stories
చైనా నేషనల్ టైమ్ సెంటర్ పై అమెరికా సైబర్ దాడి?
ఇజ్రాయిల్ స్పైవేర్‌కు అమెరికా కోర్టులో చుక్కెదురు
పాక్- అఫ్ఘాన్ మధ్య తక్షణమే కాల్పుల విరమణ