
సుమారుగా ఓ శతాబ్దం పాటు ప్రపంచ ఆర్హ్దిక వ్యవస్థను శాసించిన అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు 2025లో మారుతున్న పరిస్థితులు సంకేతం ఇస్తున్నాయి. తక్షణమే డాలర్ పతనమయ్యే అవకాశాలు లేవని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నప్పటికీ అటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) ప్రకారం, ప్రపంచ రిజర్వుల్లో డాలర్ వాటా 2025 రెండవ త్రైమాసికంలో 56.3%కు తగ్గింది. 2024లో ఇది 57.8% ఉండేది.
ఇది ఒక మెల్లగానైన తగ్గుదల సూచించగా, యూరో, యువాన్ (చైనా కరెన్సీ), ఇతర సంప్రదాయేతర కరెన్సీలు (ఆస్ట్రేలియన్ డాలర్, కెనడియన్ డాలర్ వంటి) వాటాలను కొద్దిగా పెంచుకుంటున్నాయి. దానితో డాలర్ కు ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ ఆర్ధిక లావాదేవీలు జరపాలనే ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
2025లో బ్రిక్స్ దేశాలు, దక్షిణ ఆసియా దేశాలు స్థానిక కరెన్సీల్లో వాణిజ్య చెల్లింపులు ప్రారంభించాయి. దీని వల్ల అమెరికా కరెన్సీపై ఆధారత కొంత తగ్గుతోంది. ఇంతకుముందు 45% ప్రపంచ చెల్లింపులు డాలర్లలో జరిగేవి. ఇప్పుడు అది 38%కు తగ్గిందని స్విఫ్ట్ డేటా చూపిస్తుంది .డాలర్ బలహీనతకు కారణాలు పాలసీ అస్థిరతగా భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం రెండవ టర్మ్‌లో పన్ను, టారిఫ్ మార్పులు వంటి చర్యలకు దిగడంతో పెట్టుబడి మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది.
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, ఇతర దేశాలు ఫెడ్ కంటే వేగంగా వడ్డీ తగ్గిస్తున్నాయి. దీంతో ఇతర కరెన్సీలు ఆకర్షణీయంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారు కొనుగోళ్లు పెరగడం కూడా డాలర్‌పై నమ్మకం తగ్గిన సంకేతం ఇస్తున్నది. బ్రిక్స్ కరెన్సీని ప్రవేశ పెట్టడం ద్వారా డాలర్ ఆధిపత్యానికి కళ్లెం వేయాలని రష్యా, చైనా వంటి దేశాలు బహిరంగంగానే తమ అభిమతాన్ని వ్యక్త పరచడం గమనార్హం.
ఐఎంఎఫ్, జెపి మోర్గాన్ ల విశ్లేషణల ప్రకారం తదుపరి 5–10 సంవత్సరాల్లో డాలర్ వాటా సుమారు 50కు కపడిపోవచ్చు.2030–2040 నాటికి ప్రపంచ రిజర్వ్ వ్యవస్థ బహుముఖ కరెన్సీ (అమెరికా డాలర్లు, యురొ, యువాన్, డిజిటల్ కరెన్సీల మిశ్రమం) గా మారే అవకాశం ఉంది. అయితే, అమెరికా మూలధన మార్కెట్లు ప్రపంచంలో అతి పెద్దవి (50 ట్రిలియన్ డాలర్లకుపైగా) కావడంతో డాలర్ లిక్విడిటీ, విశ్వసనీయత ఇంకా పటిష్టంగానే కొనసాగే అవకాశం ఉంది.
డాలర్ ప్రభావం తగ్గుముఖం పట్టినా పూర్తిగా కూలిపోయే అవకాశం సమీప భవిష్యత్ లో ఉండకపోవచ్చని ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్దదిగా ఉండడమే కాక, ప్రపంచ పెట్టుబడిదారులు ఇంకా దానిని “సేఫ్ హేవెన్”గా చూస్తున్నారు. అయితే, భవిష్యత్తులో ప్రపంచం డాలర్ ఆధారిత ఏకవ్యవస్థ నుంచి బహు కరెన్సీ సమతుల్య వ్యవస్థ వైపు కదలడం మాత్రం తధ్యం అని చెప్పవచ్చు.
More Stories
ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు చెబితే పాక్‌కు నిద్రపట్టదు
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ కాల్చివేత
నోటి మాట ప్రచారంతో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు కేంద్ర బిందువు!