
భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో కర్ణాటక రాజధాని బెంగళూరు గుంతలమయమైన రోడ్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, గుంతలు నిండిన రోడ్లమీద ప్రయాణంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధ్వాన్నంగా మారిన రహదారులు, మౌలిక సదుపాయాలపై నగరవాసులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
గుంతల రోడ్లతో విసిగిపోయిన స్థానికులు కర్ణాటక సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. ఇకపై తాము ఆస్తి పన్నులు చెల్లించేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. గుంతలు పడిన రోడ్లు, ఎటు చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్న బెంగళూరు దుస్థితి గురించి నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.
బెంగళూరు రోడ్లు, వీధులలో పేరుపోయిన చెత్తపై చైనా నుంచి వచ్చిన తన పారిశ్రామిక అతిథి ఒకరు వ్యాఖ్యానించినట్లు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ ఇటీవల వరుసగా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. షా చేసిన విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగ్యంగా స్పందిస్తూ ఆమె(షా) కావాలంటే రోడ్లను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఆమె వాటిని(రోడ్లను) అభివృద్ధి చేయాలనుకుంటే మమల్ని వచ్చి అడగవచ్చు. వెంటనే ఆమెకు రోడ్లను అప్పగించేస్తాం అని తెలిపారు.
డ్రైనేజీ లైన్లను మురికి నీటి మ్యాన్‌హోల్స్‌కు అనుసంధానించారని, దీంతో భారీ వర్షాల సమయంలో దాని ద్వారా భారీగా మురికినీరు వెనక్కి తన్నుతున్నదని చెప్పారు. గ్రేడియంట్ డిజైన్ లోపభూయిష్టంగా ఉండటం వల్ల కొత్తగా పునరుద్ధరించిన ప్రాంతాలు, ముఖ్యంగా పానత్తూరు ప్రధాన రోడ్డులో వరదలు వచ్చాయని వాపోయారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని అభివృద్ది పనులపై శాస్త్రీయ ఆడిట్ నిర్వహించాలని, అవకతకవలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సురక్షితమైన ఫుట్‌పాత్‌లు నిర్మించాలని, సహజ డ్రైనేజీ చానల్స్‌ను మూసివేసి ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
‘నమ్మ బెంగళూరు ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందింది. కానీ అలాంటి పౌర నిర్లక్ష్యం బ్రాండ్ బెంగళూరు గౌరవం, విశ్వసనీయతను దెబ్బతీస్తుందని’ వారు పేర్కొన్నారు. పన్నుల చెల్లింపునకు పౌరులు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, కానీ వారు దానికి తగ్గ మేలైన సౌకర్యాలు కోరుకుంటారని తెలిపారు. ‘మాకు మంచి మౌలిక సౌకర్యాలు కల్పించండి.. పన్ను వసూలు చేసుకోండి. జీబీఏ ఇదే విధంగా పన్ను దారుల విజ్ఞప్తిని నిర్లక్ష్యం చేస్తే, మా దగ్గరి నుంచి పన్ను వసూలు చేయవద్దని ఆదేశించమని మేము మిమ్మల్ని కోరుతాం’ అని వారు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
పన్ను వసూలు నుంచి ప్రభుత్వం కనుక మినహాయిస్తే తాము ఆ సొమ్ముతో సొంతంగానే మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తామని, ప్రభుత్వంపై ఎంతమాత్రం ఆధారపడమని ఫోరమ్ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఫోరమ్ సభ్యులు చేసిన ఆరోపణలు ఇంజనీర్లు తిరస్కరిస్తూ రోడ్ వర్క్స్ మాన్యువల్ ప్రకారం అంతా శాస్త్రీయంగానే పనులు చేపట్టామని తెలిపారు.
కాగా, బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ ప్రదేశాలలో తారు రోడ్లు వేస్తుండటమే కాక, గోతులు పూడ్చే పనిని యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్టు డీకే శివకుమార్ చెప్పారు.
More Stories
2027 జనాభా లెక్కలకు సిద్ధమైన కేంద్రం
భారతీయ సినిమాలంటే ఎంతో ఇష్టం.. పుతిన్
రాబోయే ఐదేళ్లలో నంబర్-1గా భారత ఆటోమొబైల్ పరిశ్రమ