చంద్రుడిపై వాతావరణంపై సూర్యుడి ప్రభావం! 

చంద్రుడిపై వాతావరణంపై సూర్యుడి ప్రభావం! 

* ఇస్రోకు కీలక సమాచారం పంపిన చంద్రయాన్‌-2

చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్‌-2 తాజాగా మరో కొత్త సమాచారాన్ని పంపింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గురించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. చంద్రుని ఎక్సోస్పియర్, వాతావరణం, ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ఈ సమాచారం సహాయపడుతుందని ఇస్రో పేర్కొంది. 

ఇస్రోకు చెందిన చంద్రయాన్-2 లూనార్ ఆర్బిటర్ అంతరిక్ష శాస్త్ర రంగంలో తొలిసారిగా ఈ సమాచారాన్ని సేకరించినట్లుగా వెల్లడించింది. చంద్రయాన్-2 లోని సాంకేతిక పరికరం అయిన ఛేస్‌-2 సూర్యుడి నుంచి వెలువడే కరోనల్ మాస్ ఎజెక్షన్ (సిఎంఈ) చంద్రుడి ఎక్సోస్పియర్‌పై ప్రభావాన్ని పరిశీలించింది. ఈ భారీ సౌర తుఫాను చంద్రుడిని తాకిన సమయంలో చంద్రుని పగటిపూట ఎక్సోస్పియర్‌లో మొత్తం పీడనం అకస్మాత్తుగా పెరిగిందని చంద్రయాన్-2 డేటా తెలిపింది. 

వాతావరణంలోని అణువులు, వాటి సాంద్రత పది రెట్లు ఎక్కువ పెరిగిందని ఛేస్‌-2 నమోదు చేసిందని ఇస్రో పేర్కొంది. ఈ సంఘటన 10 మే 2024న జరిగింది. ఈ సమయంలో సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్ల ప్రభావం చంద్రుడిపై పడినట్లుగా ఇస్రో పేర్కొంది. చంద్రుడికి భూమిలా అయస్కాంత క్షేత్రం, దట్టమైన వాతావరణం లేనందున ఈ కరోనల్ మాస్‌ ఎజెక్షన్‌ల వెలువడిన కణాలు నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టినట్లుగా పేర్కొంది. 

ఈ కణాల ప్రభావం వల్ల చంద్రుని ఉపరితలం నుంచి పెద్ద సంఖ్యలో అణువులు ఎక్సోస్పియర్‌లోకి వెళ్లాయని.. దాంతో అత్యంత సన్నని పొర ప్రతికూలంగా ప్రభావితమైందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యుడి నుంచి వచ్చే శక్తి, పేలుడు అయిన కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు చంద్రుడి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చంద్రయాన్-2 మొదటిసారిగా శాస్త్రీయంగా పరిశీలించిందని చెప్పింది.

ఇది చంద్రుడి ఎక్సోస్పియర్‌ను బాగా అర్థం చేసుకునేందుకు, ఉపరితలంపై అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తుందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 మిషన్‌ను జూలై 22, 2019న శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి-ఎంకెIII-ఎం1 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మిషన్ ఎనిమిది శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్లి 20 ఆగస్టు 2019న చంద్ర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. 

విక్రమ్ ల్యాండర్‌తో 7 సెప్టెంబర్ 2019న సంబంధాలు కోల్పోయినప్పటికీ ఆర్బిటర్ ఇప్పటికీ 100 కి.మీ x 100 కి.మీ చంద్ర కక్ష్యలో తిరుగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు డేటాను సేకరించి ఇస్రోకు పంపుతుంది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని శాస్త్రవేత్తలు లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.  భవిష్యత్‌లో చంద్రుడిపైకి పరిశోధనా కేంద్రాలను, మావన ఆవాసాలను ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్లు పెద్ద సవాల్‌గా నిలిచే అవకావం ఉందని.. వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సి ఉంటుందని ఇస్రో పేర్కొంది.