అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. ఇరు మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా జరగిన చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈమేరకు ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొంది.
ఈ చర్చల్లో ఇరుదేశాలకు చెందిన రక్షణ మంత్రులు పాల్గొన్నారని తెలిపింది. ఇరుదేశాల మధ్య దోహా వేదికగా జరిగిన శాంతి చర్చలు విజయవంతమయ్యాయి. ఖతార్ విదేశాంగ శాఖ వెల్లడించిన ప్రకారం, రెండు రౌండ్లుగా జరిగిన చర్చల్లో పాక్–అఫ్గాన్ ప్రతినిధులు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం కోసం అనేక అంశాలపై చర్చించారు. తక్షణ కాల్పుల విరమణతో పాటు, దాని అమలు, పర్యవేక్షణకు అవసరమైన చర్యలపై కూడా అవగాహనకు వచ్చారు.
రానున్న రోజుల్లో అనుసంధాన సమావేశాలు నిర్వహించి ఈ ఒప్పందం నిలకడగా కొనసాగేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని ఖతార్ తెలిపింది. “ఈ చర్చలు ప్రాంతీయ శాంతి కోసం ఒక సానుకూల అడుగు. పాక్–అఫ్గాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాం. దీర్ఘకాల శాంతి, భద్రత కోసం ఇరుదేశాలు కలసి పనిచేయాలి” అని ఖతార్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
చర్చలు ప్రారంభమయ్యే 24 గంటల ముందే అఫ్గాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాక్ వైమానిక దాడులు జరగడం గమనార్హం. ఆ దాడుల్లో కనీసం 17 మంది మృతి చెందారని, వారిలో ముగ్గురు అఫ్గాన్ యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులు ఉన్నారని అఫ్గాన్ అధికారులు తెలిపారు. అయితే, పాక్ భద్రతా దళాలు మాత్రం తాము ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులెవరూ మృతిచెందలేదని స్పష్టం చేశాయి.
ఇరుదేశాల మధ్య గత కొన్ని నెలలుగా సరిహద్దు దాడులు, పరస్పర ఆరోపణలు పెరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ వర్గాలు అఫ్గాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు తమ సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించగా, అఫ్గాన్ అధికారులు ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. “సరిహద్దు భద్రతను మెరుగుపరచడం, ఉగ్రవాదాన్ని అరికట్టడం మా లక్ష్యం. పాక్ చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి” అని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.
More Stories
అంతర్జాతీయ వ్యవస్థలో సంస్కరణలు దిశగా చైనా, భారత్
ట్రంప్ పాలనపై అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ నిరసలు
రెండేండ్లలో 63 శాతం తగ్గిన అమెరికాకు భారతీయ విద్యార్థులు