
బిహార్ ఎన్నికల సంగ్రామం అనూహ్య మలుపు తీసుకుంది. విపక్ష ఇండియా (మహా ఘట్బంధన్) కూటమిలో చీలిక ఏర్పడింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ సీట్లను పంచుకునే అంశంలో కూటమిలోని పార్టీలు ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయాయి. పర్యవసానంగా 10 సీట్లలో విపక్ష పార్టీలు కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమకు ఇష్టమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి.
విపక్ష ఇండియా కూటమిలో ఏర్పడిన చీలికను చూపుతున్న ఈ 10 అసెంబ్లీ స్థానాలు రాజకీయంగా సున్నితమైనవి. రాబోయే 24 గంటల్లోగా వీటి విషయంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ, సీపీఐలు ఏం చేస్తాయి? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయా చోట్ల ఉమ్మడి అభ్యర్థులను నిర్ణయించి, 2024 లోక్‌సభ ఎన్నికల తరహాలో ఐక్యతను చాటుకుంటాయా? పరస్పర పోటీకి, ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనే ముసుగును తొడిగి వదిలేస్తాయా ? అనేది వేచిచూడాలి.
తాము ఐక్యంగానే ఉన్నామని కాంగ్రెస్, ఆర్జేడీ చెబుతున్నప్పటికీ, తాజా పరిణామాలు ఇండియా కూటమిలో ఏర్పడిన చీలికను అద్దం పడుతున్నాయి. ఓ వైపు అధికార ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటులో విజయవంతం అయింది. ఆరు పార్టీలతో కూడిన విపక్ష ఇండియా కూటమిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు సీట్ల పంపకాలపై ఇండియా కూటమి నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
ఎటువంటి ప్రకటన లేకుండానే, తొలి విడత పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి పార్టీలు బరిలోకి దింపడం గమనార్హం. ఇండియా కూటమిలోని పార్టీలవారీగా చూస్తే, 72 సీట్లలో ఆర్జేడీ, 24 సీట్లలో కాంగ్రెస్, సీపీఐఎంఎల్ 14 సీట్లలో, వీఐపీ 6 సీట్లలో, ఐఐపీ 2 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇండియా కూటమికి పెద్దదిక్కు ఆర్జేడీ పార్టీ. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్జేడీ అత్యధికంగా 75 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది.
ఇంత కీలకమైన ఆర్జేడీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా, నేరుగా వారితో నామినేషన్లు వేయించింది. కూటమిలోని పార్టీల నడుమ లోపించిన సమన్వయానికి ఈ అంశం నిలువెత్తు నిదర్శనం. బిహార్‌లోని మొత్తం 243 సీట్లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్ జరగనున్న మిగతా స్థానాల్లోనూ వీలైనన్ని ఎక్కువ చోట్ల అభ్యర్థులను ఆర్జేడీ బరిలోకి దింపనుంది. రాష్ట్రంలోని దాదాపు 130 సీట్లలో అభ్యర్థులకు ఆర్జేడీ ఇప్పటికే సింబల్స్‌ను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినందు వల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలే కోర్టుకు హాజరయ్యేందుకు లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్ ఢిల్లీకి వెళ్లారు. ఈసందర్భంగా వారిద్దరు రాహుల్ గాంధీని కలవాలని భావించగా, కలవలేకపోయారని చర్చ జరుగుతోంది.
నేతలకు లాలూప్రసాద్ యాదవ్ పంపిణీ చేసిన ఆర్జేడీ పార్టీ సింబల్స్‌ను వెనక్కి తీసుకునే అంశంపై రాహుల్‌తో చర్చించాలని తేజస్వి భావించినట్లు తెలిసింది. దీనిపై చర్చ జరగకపోవడంతో సింబల్స్ పంపిణీ విషయంలో ఆర్జేడీ తన ఇష్టం ప్రకారం ప్రొసీడ్ అవుతోందని అంటున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పటికీ బలహీనంగానే ఉందని, బిహార్‌లో నిజమైన బలం తమ పార్టీకే ఉందని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ విశ్వసిస్తున్నారు.
కాంగ్రెస్‌కు మరీ ఎక్కువగా సీట్లు కేటాయించడం సరికాదని ఆయన వాదిస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. రాహుల్ గాంధీ యాత్ర వల్ల బిహార్‌లో తాము బలోపేతం అయ్యామని హస్తం పార్టీ అంటోంది. తద్వారా 2029 లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్‌ను కాంగ్రెస్ ప్రిపేర్ చేసుకుంటోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోవంక, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ల పంపిణీపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత అసమ్మతిని ఎదుర్కొంటోంది.
అంకితభావంతో కూడిన అట్టడుగు వర్గాల కార్యకర్తల కంటే సంపన్న అభ్యర్థులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపిస్తూ, పలువురు నాయకులు, అట్టడుగు వర్గాల కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శనివారం పాట్నాలో పార్టీ రాష్ట్ర పరిశోధనా విభాగం అధిపతి ఆనంద్ మాధవ్, ఇతర సీనియర్ నాయకుల నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అంశం తెరపైకి వచ్చింది.
పార్టీ నాయకత్వం ఆర్థిక వనరులతో అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తూ, సంవత్సరాలుగా అట్టడుగు స్థాయిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారిని పక్కనపెడుతోందని ఆనంద్ మాధవ్ ఆరోపించారు. ఆయనతో పాటు గజానంద్ షాహి, ఛత్రపతి తివారీ, నాగేంద్ర ప్రసాద్ వికల్, రంజన్ సింగ్, బచ్చు ప్రసాద్ సింగ్, బంటీ చౌదరి వంటి నాయకులు కూడా ఉన్నారు. టికెట్ కేటాయింపు సమయంలో లోపభూయిష్ట నిర్ణయాలు తీసుకున్నందుకు బీహార్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణ అల్లవారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్‌లను కూడా ఈ బృందం నిందించింది.
More Stories
చిత్తాపూర్లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ అనుమతి రద్దు
చంద్రుడిపై వాతావరణంపై సూర్యుడి ప్రభావం!
ట్రంప్ పాలనపై అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ నిరసలు