రెండేండ్లలో 63 శాతం తగ్గిన అమెరికాకు భారతీయ విద్యార్థులు

రెండేండ్లలో 63 శాతం తగ్గిన అమెరికాకు భారతీయ విద్యార్థులు

భారతీయ విద్యార్థులకు అమెరికా విద్యపై మోజు తగ్గుతున్నది. వీసా నిబంధనలు, పెరిగిన వ్యయం, తగ్గిన ఉపాధి అవకాశాల నేపథ్యంలో భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు బదులుగా యూరప్‌వైపు తమ దృష్టి మరల్చారు. గత రెండేండ్లలో ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకొనే భారత విద్యార్థుల సంఖ్య 63% తగ్గినట్టు విద్యారుణాలు అందించే జ్ఞాన్‌ధన్‌ సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

విదేశాల్లో చదువుకోవాలనుకొనే భారత విద్యార్థుల్లో అమెరికాను ఎంచుకొనే వారు 2023లో 54% మంది ఉండగా అది 2025 నాటికి 20 శాతానికి పడిపోయినట్టు ఆ వివరాలు తెలుపుతున్నాయి. అమెరికాలో ఇటీవల అమలులోకి వచ్చిన కఠిన వీసా నిబంధనలు, పెరిగిన ఖర్చులు, విద్యానంతరం ఉపాధి అవకాశాలకు గ్యారెంటీ లేకపోవడం వంటి అంశాలు విద్యార్థులను యూరప్‌ వైపు మరలుస్తున్నాయని జ్ఞాన్‌ధన్‌ సీఈవో అంకిత్‌ మెహ్రా పేర్కొన్నారు. 

హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుదల, ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ) సమీక్షలు వంటి అంశాలు విద్యార్థులను ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించేలా చేశాయని తెలిపారు. ఎక్కువ మంది భారత విద్యార్థులు యూరప్‌లోని జర్మనీ, ఐర్లాండ్‌, ఫ్రాన్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. తమ వద్ద ట్యూషన్‌ ఫీజులు తక్కువని, విద్య అనంతరం ఉపాధి విధానాలను సరళీకరించామని చెప్తూ జర్మనీ విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్నది.

దీంతో జర్మనీవైపు మొగ్గుచూపే భారత విద్యార్థుల సంఖ్య 2023లో 4% నుంచి 2025 నాటికి 9 శాతానికి పెరిగింది.  విదేశాల్లో చదువుకోవాలనుకొనే భారత విద్యార్థుల్లో 39% మంది బ్రిటన్‌ను ఎంచుకొంటుండగా ఈ ఏడాది వారి సంఖ్య 143 శాతం పెరిగింది. మరోవైపు కెనడా వైపు వెళ్లే వారి సంఖ్య సైతం 11% నుంచి 2.33 శాతానికి తగ్గిపోగా ఆస్ట్రేలియాను ఎంచుకొనే వారి సంఖ్య స్థిరంగా 7% వద్ద ఉన్నది.

ట్రంప్‌ ప్రభుత్వం స్టూడెంట్‌ వీసా విధానాలను కట్టుదిట్టం చేయడంతోపాటు అభ్యర్థుల సోషల్‌ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా శోధించడం వంటి చర్యలు చేపట్టింది. జాతీయ భద్రత ముప్పును పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుదారుల వివరాలను లోతుగా పరిశీలించాలని దౌత్యాధికారులను అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. 

అమెరికా గుర్తించిన విదేశీ ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, మద్దతును కూడగట్టేందుకు అభ్యర్థులు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులతోపాటు, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడిన అభ్యర్థులను దేశంలోకి అనుమతించవద్దని ట్రంప్‌ ప్రభుత్వం ఆదేశించింది. అంతేగాక హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(రూ. 88లక్షలు) పెంచడంతో విద్యార్థులు, యువ వృత్తి నిపుణులకు అమెరికా కలలు తీరడం ఇక కష్టంగా పరిణమిస్తోంది.